కాంగ్రెస్‌కు న్యాయ వ్యవస్థపై గౌరవం లేదు
హుబ్లీ: కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం, న్యాయవ్యవస్థను గౌరవించడం లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగం, న్యాయాంగ వ్యవస్థలను కాంగ్రెస్ పార్టీ గౌరవించడం లేదన్నది మరోసారి తేటతెల్లమైందన్నారు. దేశం కాంగ్రెస్ లేని భారత్ అవుతోంది. అయినా కాంగ్రెస్ నేతల తీరు తెన్నుల్లో మార్పు లేదన్నారు. కోర్టుల్లో సానుకూల తీర్పులు వస్తే మాత్రమే జీర్ణించుకుంటారు. లేకపోతే న్యాయాంగ వ్యవస్థను దూషిస్తారన్నారు. ఇలాంటి నేతలకు తాము చెప్పినట్లుగా నడుచుకునే న్యాయమూర్తులు కావాలన్నారు. కుహనా రాజకీయ వాదం, బుజ్జగింపుల తీరుతెన్నులపై తమకు అనుకూలమైనట్లుగా తీర్పు రాలేదన్న అక్కసుతో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిపై చర్యలకు డిమాండ్ చే స్తున్నారన్నారు.
తీర్పుపై అప్పీలు సహజం
తీర్పుపై అప్పీలు చేసుకోవడం సహజమన్నారు. అయితే న్యాయమూర్తినే అభిశంసన చేయాలంటారా? అని ప్రశ్నించారు. న్యాయమూర్తి అవినీతికి పాల్పడి ఉంటే ఆ పదవిని దుర్వినియోగం చేసుకొని ఉంటే అలాంటి శిక్షను వేయవచ్చన్నారు. దేశ చరిత్రలోనే వారికి విరుద్ధంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అభిశంసన తీర్మానం చేయడానికి సంతకాల అభియాన్ చేపట్టారన్నారు. రేపు ఎన్నికల బాండ్ కేసులో కూడా వారికి విరుద్ధంగా తీర్పు వస్తే అప్పుడు కూడా న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెడతారా? అని నిలదీశారు. సిద్ధరామయ్యకు విరుద్ధంగా తీర్పు వస్తే న్యాయమూర్తులను తొలగిస్తారా? ఇలా ప్రక్రియ కొనసాగిస్తుంటే న్యాయాంగ వ్యవస్థకు గౌరవం ఏం మిగులుతుందని జోషి కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు.
కర్ణాటకను విభజించం
ప్రత్యేక రాష్ట్ర విషయంపై అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ కర్ణాటకను విభజించరాదన్నారు. ఈ విషయంలో బీజేపీ ఏ కారణంగాను కర్ణాటకను విభజించబోదని తేల్చిచెప్పారు. ఆర్థిక అసమానతలు ఉంటే పరిహారం ఉంటుందన్నారు. రోడ్ల అభివృద్ధికి కర్ణాటక సర్కార్ నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. అపార్ట్‌మెంట్ యజమానిపై డీకే శివకుమార్ పెద్దగా నోరు పారేసుకోవడం ఆయన నడతకు నిదర్శనమన్నారు. డీకే శివకుమార్ ఎవరికి శిష్యుడో అందరికీ తెలిసిందేనన్నారు.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి


