బళ్లారిలో బంగారం పేరిట బురిడీ
సాక్షి,బళ్లారి: ఆయన బళ్లారి నగరంలో పేరొందిన బంగారు వ్యాపారి. అయితే ఉన్నఫళంగా బోర్డు తిప్పేశారు. నగరంలోని బెంగళూరు రోడ్డులో సాయి కమల్ జ్యువెలరీ యజమాని జగదీష్ గుప్తా ఐపీ పెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. గత 15 రోజులుగా గుప్తా కనిపించకపోవడంతో గాంధీనగర్ పోలీసు స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో ఆయన నగరంలో ప్రత్యక్షమయ్యారు. కోట్లాది రూపాయల బంగారు వ్యాపారం చేస్తూ పేరు గడించిన ఈయన ఎంతో మంది వద్ద నెలవారీ చందాలు కూడా కట్టించుకుని బంగారు వ్యాపారం చేసేవారని తెలుస్తోంది. నెలనెలా డబ్బులు కంతుల వారీగా కడితే సంవత్సరం తర్వాత అందుకు సంబంధించిన బంగారం తరుగు తదితరాలు లేకుండా ఇస్తుండటంతో జనం పెద్ద ఎత్తున నెల వారి చందాలను కోట్లాది రూపాయల మేర చెల్లించారు. గుప్తా కూడా బెంగళూరులో ఓ వ్యవహారంలో పెద్ద ఎత్తున మోసపోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ వ్యాపారి ఐపీ పెట్టడంతో తమ డబ్బులకు ఇక దిక్కు ఎవరు? అని భయాందోళన చెందుతున్న తరుణంలో కంతుల ప్రకారం బంగారం కోసం చిన్న మొత్తాల్లో కట్టిన డబ్బులు ఆయన తిరిగి ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు.
అందరికీ పంగనామాలు
అయితే పెద్ద మొత్తంలో చందాలు కట్టి బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారి నగదుకు ఆయన పంగనామాలు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో చాలామంది బాధితులు బయటకు తెలిస్తే పరువు పోవడంతో పాటు ఐటీ అధికారులు అడుగుతారని మథనపడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా తమ డబ్బులను ఎలా వెనక్కి తీసుకోవాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. గత 15 సంవత్సరాలుగా గుప్తా ఇలాంటి వ్యాపారం పెద్ద ఎత్తున చేస్తున్నట్లు తెలుస్తోంది. నెల నెలా కంతులు చెల్లించే వారి డబ్బులు కోట్లాది రూపాయలకు చేరుకుంది. ఆయన కులానికి చెందిన వారే ఎక్కువ మంది ఇలాంటి కంతులు చెల్లించి బంగారం కొనుగోలు చేసేవారని, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల పేర్ల మీద చాలా మంది కంతులు చెల్లిస్తున్నట్లు తెలిసింది. కొందరు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేయగా, మరికొందరు తామే పరిష్కరించుకుంటామని చెప్పడం గమనార్హం. పిల్లల పెళ్లిళ్లు, పొదుపు కోసం బంగారం కొనాలనుకున్న అనేకమంది మధ్యతరగతివారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జ్యువెలరీ యజమాని దివాలా
భయాందోళనలో డిపాజిట్‌దారులు
బంగారం స్కీము ద్వారా కోట్లాది రూపాయల వసూలు
చర్చనీయంగా మారిన బంగారు వ్యాపారి తీరు


