నవలి రిజర్వాయర్ నిర్మాణం కలేనా?
రాయచూరు రూరల్: తుంగభద్ర డ్యాం పాతబడడంతో నూతనంగా కొప్పళ జిల్లా గంగావతి తాలూకా నవలి వద్ద చేపట్టనున్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం కలేనా? అనే అనుమానాలు పెరుగుతున్నాయి. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి యడియూరప్ప నవలి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం కోసం అనుమతి ఇచ్చారు. రూ.15 వేల కోట్లతో చేపట్టనున్న నవలి రిజర్వాయర్ నిర్మాణం ఇక అటకెక్కినట్లేని ఆయకట్టు రైతులు భావిస్తున్నారు. తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్ల అమరిక పనులు చేపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నవలి రిజర్వాయర్ నిర్మాణానికి తిలోదకాలిచ్చినట్లేనని తెలుస్తోంది. రూ.15 వేల కోట్ల వ్యయంతో చేపట్టే దానికంటే డ్యాంకు క్రస్‌గేట్లు ఏర్పాటు చేస్తే మరో 50 ఏళ్ల వరకు రైతులకు సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించిన సర్కార్ నవలి వద్ద నిర్మించే రిజర్వాయర్‌కు వేసిన పునాది కేవలం పేరుకు మాత్రమే అనే చర్చ వినబడుతోంది. కొప్పళ, రాయచూరు జిల్లాల రైతులకు నవలి వద్ద రిజర్వాయర్ ఏర్పాటైతే ఆయకట్టు చివరి భూముల రైతులకు సక్రమంగా నీరందుతాయనే భావనకు ప్రభుత్వ ఉదాసీనత గొడ్డలి పెట్టుగా మారింది. దీంతో తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూముల రైతుల ఆశలు అడియాసలయ్యాయి.
నేడు పూర్వ విద్యార్థుల సమ్మేళనం
రాయచూరు రూరల్: నగరంలోని టాగూర్ పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు అలుమ్ని బ్యాచ్ సంచాలకులు వీరేంద్ర జాలదార్ వెల్లడించారు. శనివారం పాత్రికేయుల భవనంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1975 నుంచి పాఠశాలలో విద్యనభ్యసించిన పాత విద్యార్థుల ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారన్నారు. దేశ, విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు సుమారు 2500 మందికి పైగా కార్యక్రమంలో పాల్గొని తమ అనుభవాలను పంచుకుంటారన్నారు.
మహిళా కాంగ్రెస్‌కు నియామకం
రాయచూరు రూరల్: రాష్ట్ర మహిళ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా వందనను నియమిస్తూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సౌమ్యారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆమె ఈమేరకు శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలపై స్పందించాలని కార్యకర్తలకు సూచించారు. త్వరలో జరగనున్న జిల్లా, తాలూకా, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం జారీ చేసిన పంచ గ్యారెంటీ పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలన్నారు.
గంజాయికి అడ్డుకట్ట వేద్దాం
మాలూరు: తాలూకాలో గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని సీఐ రామప్ప సూచించారు. పట్టణంలోని పాత్రికేయుల సంఘం కార్యాలయంలో శనివారం ఆ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నగర, గ్రామీణ ప్రాంతాలలో గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టపడాలంటే ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. తాలూకాలో ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందితే తమకు సమాచారం అందించాలన్నారు. రాత్రి సమయాల్లో పోలీసు గస్తీని పెంచుతామన్నారు. సంఘం అధ్యక్షుడు విజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి పాల్గొన్నారు.
యువత కౌశల్యాలను
పెంచుకోవాలి
కోలారు: యువకులు సమయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ కౌశల్యాలను పెంపొందించుకోవాలని కేజీఎఫ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నారాయణ్ సూచించారు. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన స్కౌట్స్ అండ్ గైడ్స్ ధ్వజ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని స్కౌట్స్ ధ్వజాలను విడుదల చేసి మాట్లాడారు. యువకులు చదవడాన్ని అభ్యాసం చేసుకున్నప్పుడే ఇతిహాసాన్ని అధ్యయనం చేయడానికి సాధ్యమవుతుందన్నారు. స్కౌట్స్ బాబు, అంథోని సలీనా, వెంకటేష్, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థినులకు అభినందనలు
కోలారు: బెంగళూరు విశ్వ విద్యాలయం అంతర్ జిల్లా కొండగుట్టల పరుగు పందెం పోటీల్లో కోలారు మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించారని కళాశాల క్రీడా సమితి సభ్యుడు సుబ్రమణి తెలిపారు. విశేష సాధన చేసిన విద్యార్థినులు తనుశ్రీ, జ్యోతి, శైలా, ఆశా, దివ్య, ఉమాశ్రీలను అభినందించారు. ప్రిన్సిపాల్ శ్రీనివాసగౌడ మాట్లాడుతూ కళాశాల విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ చాటి పేరుప్రతిష్టఉ తేవడం కళాశాలకు గర్వకారణమన్నారు.


