చెరకు రైతు విలవిల
హొసపేటె: పంటకు తగిన లాభాలు లేక చెరకు రైతులు విలవిలలాడుతున్నారు. నాలుగేళ్లలో పంటకోసం చేసిన అప్పులు తీరకపోగా.. కర్మాగారంలో ఉత్పత్తులు తగ్గడం వారికి మరింత భారంగా మారింది. హొసపెటె తాలూకా పరిధిలో గతంలో ఐదు నుంచి ఆరు లక్షల టన్నుల చెరకు పండేది. ఎకరాకు కనీసం 45 నుంచి 55 టన్నుల దిగుబడి వచ్చేది. అయితే నాలుగేళ్లలో పంట తగ్గుముఖం పడుతోంది. ఆరంభంలో ఎకరాకు 30 నుంచి 35 టన్నులు మాత్రమే ఉండగా.. తాజాగా 10 నుంచి 15 టన్నులకు చెరకు దిగుబడులు తగ్గిపోయాయి. ఎకరా పొలంలో పంట సాగుకు రూ.45వేలు అవుతుండగా.. 30 టన్నుల దిగుబడి వస్తే రూ.50వేలు అందుతోంది. దీంతో రైతులు తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేని పరిస్థితి.
భారీ వర్షాలతో తెగుళ్లు
గత మూడు సంవత్సరాలుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెగుళ్ల వ్యాప్తితో చెరకు దిగుబడులు తగ్గాయి. దీనికి తోడు ఎనిమిదేళ్ల కిందట స్థానిక ఐఎస్‌ఆర్ చక్కెర కర్మాగారం మూసి వేశారు. ప్రతి సీజన్‌లోనూ దూరంగా ఉండే కర్మాగారాలకు చెరకు రవాణా చేసేందుకు రైతులు ఇబ్బందిపడుతున్నారు. దీంతో నాలుగేళ్లలో చెరకు సాగ తగ్గుముఖం పట్టింది. తీసుకున్న అప్పును చెల్లించడానికి రైతులు ప్రయత్నిస్తున్నా... ఒకవైపు, తాలూకా వెలుపల ఉన్న ఫ్యాక్టరీ నిర్వహణ బోర్డు చెరకు కొనడానికి ఉదాసీనత వ్యక్తం చేస్తోంది. భారీ వర్షాలతో నగర శివార్లలో పండించిన చెరకును కోసి బయటకు రవాణా చేయలేకపోవడంతో కర్మాగారం యాజమాన్యం విత్తనాలు, ఎరువులు ఇవ్వడం చేశారు. అయితే తాజాగా అవేవీ చేయడం లేదు. రైతుకు భారం కాగా సాగు చేయడం లేదు. దీంతో చెరకు దిగుబడి తగ్గుతోంది.


