పులి, చిరుత, మొసలి.. ఆ గ్రామస్తులు హడల్
మైసూరు: జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని గ్రామాల ప్రజలకు పులి, చిరుతలతో పాటు తాజాగా మొసలి బెడద కూడా మొదలైంది. హుస్కూరు గ్రామ చెరువులో మొసలి కనిపించడంతో ప్రజలు కలవరపడుతున్నారు. మూడు రోజులుగా మొసలి సంచరిస్తుండటాన్ని రైతులు గమనించారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా చెరువులో నిఘా పెట్టారు. హుస్కూరు గ్రామ పరిసరాల్లో పెద్ద పులి, చిరుతలు కూడా తిరుగుతున్నాయని, వాటిని బంధించి ప్రజలకు భద్రత కల్పించాలని రైతు సంఘం నేత హుస్కూరు గిరీష్ కోరారు.
ఇంటికి రంగులు...
బంగారానికి రెక్కలు
మైసూరు: ఇంటికి రంగులు వేయించి బాగు చేసుకున్న ఆనందం అతనికి మిగల్లేదు. ఓ వ్యక్తి ఇంటిలోని బీరువాలో భద్రపరిచిన 48 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైన ఘటన నగరంలోని వీవీపురం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. మైసూరులోని యాదవగిరి నివాసి బోరేగౌడ ఇంటికి రంగు వేయించేందుకు, కార్పెంటరీ పని కోసం పెయింటర్లను, పనివాళ్లను పిలిపించారు. ఆరుమంది వచ్చి కూలి పనులు చేశారు. పనులు ముగించుకుని కూలి డబ్బులు తీసుకుని వెళ్లారు. తరువాత బీరువాలో చూసుకోగా 48 గ్రాముల బంగారు నగలు కనిపించలేదు. దీంతో బోరేగౌడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హాస్టల్ మీద విద్యార్థిని
మృతదేహం
శివమొగ్గ: విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శివమొగ్గ నగరంలోని కోట రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రభుత్వ మహిళా వసతి గృహంలో బుధవారం జరిగింది. భద్రావతి తాలూకా గంగూరుకు చెందిన టీసీ వనిషా (21) మృతురాలు. వనిషా డీవీఎస్ కాలేజీలో బీఎస్సీ చివరి ఏడాది చదువుతూ హాస్టల్‌లో ఉంటోంది. బుధవారం హాస్టల్ పై నీటి ట్యాంకు పక్కన వనిషా ఉరి వేసుకున్న స్థితిలో శవమై తేలింది. కొందరు విద్యార్థినులు చూసి వార్డెన్‌కు సమాచారం అందించారు. కోటె స్టేషన్ పోలీసులు స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యేనని అనుమానిస్తున్నారు.
అధిక ఫీజులపై
విద్యార్థుల ధర్నా
కోలారు: బెంగళూరు ఉత్తర విశ్వ విద్యాలయం పరిధిలోని కాలేజీలలో ఫీజులు పెంచడాన్ని ఖండిస్తూ ఎబివిపి కార్యకర్తలు బుధవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. పరీక్షా ఫీజులను ఉన్నపళంగా పెంచి పెను భారం మోపిందన్నారు. దీని వెనుక డబ్బులు గుంజే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మార్కుల జాబితా ఫీజును 150 నుంచి 215 రూపాయలకు పెంచిందన్నారు. ప్రాసెసింగ్ ఫీజును 25 రూపాయల నుంచి రూ. 50 కి పెంచింది. ఆర్ట్స్ విద్యార్థులకు గతేడాది రూ. 808 ఫీజు ఉంటే, ఇప్పుడు రూ.1042 కి పెంచారన్నారు. ఇలా అన్ని ఫీజులను పెంచడంతో పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.
గురుకృపతో కర్మల
నుంచి విముక్తి
చింతామణి: నిత్యం నిరంతరం గురువు స్మరణతో గత జన్మలో చేసిన కర్మలు కూడా నాశనమై విముక్తి లభిస్తుందని కై వార ధర్మాధికారి జయరాం అన్నారు. బుధవారం కై వారం దేవస్థానంలో సద్గురు యోగి నారేయణ తాతయ్య మఠం ఆవరణలో కార్తీక పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. తాతయ్య కీర్తనలు సామాన్య భాషలో సామాన్యులకు అర్థమయినట్లు రచించారన్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ అమర నారేయణస్వామి, సద్గురు తాతయ్య ఉత్సవమూర్తులకు విశేష పూజలు జరిపి పల్లకీ ఉత్సవం జరిపించారు.
పులి, చిరుత, మొసలి.. ఆ గ్రామస్తులు హడల్
పులి, చిరుత, మొసలి.. ఆ గ్రామస్తులు హడల్
పులి, చిరుత, మొసలి.. ఆ గ్రామస్తులు హడల్


