మద్దతు ధర కోసం చెరుకు రైతు పోరు బాట
రాయచూరు రూరల్: రాష్ట్రంలో అత్యధికంగా చెరుకు పంట పండించే బెళగావి జిల్లాలో రైతులు తాము పండించిన చెరుకు పంటకు మద్దతుధర ప్రకటించాలంటూ రోడ్డెక్కారు. ఆరుగాలం కష్ట పడి పండించిన పంటకు మద్దతు ధర లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు. ఏడాది పాటు పంట పండించినా రైతుకు గిట్టుబాటు ధర లేదంటూ పరిశ్రమలు, సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహారాష్ట్రలో ఉన్న చెరుకు నియంత్రణ మండలి ద్వారా ఆ ప్రాంత రైతులకు టన్నుకు రూ.3,750 ధర లభిస్తోంది. కర్ణాటకలో చెరుకు నియంత్రణ మండలి ఉన్నా ఫలితం లేకుండా పోయిందనే భావన రైతుల్లో నెలకొంది. రాష్ట్రంలో చెరుకు నియంత్రణ మండలి రైతుల తరపున కాకుండా కేవలం పరిశ్రమలు పెట్టిన వారికి తొత్తుగా మారిందని, రైతులకు మరణ శాసనంగా మారిందని ఆరోపించారు. ప్రతి టన్నుకు రూ.3,500 చొప్పున మద్దతు ధర కల్పించాలని రైతులు పట్టుబట్టారు.


