అన్నదాతల్లో ముసురు భయం | - | Sakshi
Sakshi News home page

అన్నదాతల్లో ముసురు భయం

Nov 6 2025 8:08 AM | Updated on Nov 6 2025 8:08 AM

అన్నద

అన్నదాతల్లో ముసురు భయం

సాక్షి, బళ్లారి: ఈసారి ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి వర్షాలు బాగా కురవడంతో పాటు తుంగభద్ర ఆయకట్టు ఎగువన భారీ వర్షాలు కురవడంతో డ్యాంలోకి జూన్‌ నెలాఖరు కల్లా తగినంత నీరు రావడంతో పాటు జూలైలోనే కాలువలకు నీటిని విడుదల చేయడంతో తుంగభద్ర ఆయకట్టు రైతులు ఉత్సాహంగా పంటలను సాగు చేశారు. ఆయకట్టు పరిధిలో బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర నాలుగు జిల్లాల్లో దాదాపు 15 లక్షల ఎకరాల్లో వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న, జొన్న, కొర్రలు, సాములు తదితర పంటలను విస్తారంగా సాగు చేశారు. తమకు అనుకూలమైన పంటలను రైతులు సాగు చేసిన నేపథ్యంలో అష్టకష్టాలతో లక్షలాది రూపాయలను పెట్టుబడులు పెట్టి పంటలను కాపాడుకుంటూ వచ్చారు. మూడు నెలలుగా పంటలకు సోకిన తెగుళ్లను నివారిస్తూ కలుపు మొక్కలను తొలగించి చంటి బిడ్డలా పెంచి తీరా పంట చేతికి అందే సమయంలో గత 15 రోజుల నుంచి వివిధ రకాలుగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు, తుఫాను ప్రభావం, చలి గాలులు వీస్తుండటంతో ఆయకట్టు పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

గోరుచుట్టుపై రోకటి పోటులా వర్షాలు

వరి గింజలు బాగా పట్టి మరో 15–20 రోజుల్లో కోతలు జరుగుతాయని ఆశిస్తున్నా రైతాంగానికి గోరుచుట్టుపై రోకటి పోటులా వర్షాలు వెంటాడుతుండటంతో వరి నేల మీద వాలుతూ గింజలు నేలరాలుతున్నాయి. దీంతో రైతులు కన్నీరు పెట్టాల్సిన దయనీయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు చేతికి అందేసరికి వరుణుడు వాతావరణ ప్రభావం వల్ల పంటలపై పడుతుండటంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. వరి రైతులే కాకుండా మిర్చి రైతులు, మొక్కజొన్న రైతుల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. గత మూడేళ్లుగా మిర్చి పంటను సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో ఈసారి తెగుళ్లు వెంటాడుతుండటం వల్ల వాతావరణ ప్రభావం కూడా మిర్చి పంటపై తీవ్రంగా ప్రభావం చూపింది. రోజు మార్చి రోజు మందులు కొడుతున్నా మిర్చి తెగుళ్లు పోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోంథా తుఫాను ప్రభావం తగ్గినప్పటికీ ఈదురు గాలులు కొనసాగుతుండటంతో రోగాలు వెంటాడుతుండటంతో మిర్చి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వర్ష ప్రభావంతో నేలకొరిగిన వరి పైరు(ఫైల్‌)

ఈదురుగాలికి నేలకొరిగిన కొర్ర పంట(ఫైల్‌)

ఈదురు గాలులు, వరుసగా భారీ వర్షాలు

వర్ష ప్రభావంతో నేలవాలుతున్న పంటలు

పంట చేతికి అందే వరకు దేవుడిపైనే భారం

తుంగభద్ర ఆయకట్టు పరిధిలో లక్షలాది ఎకరాల్లో సాగు చేసిన ప్రతి రైతన్న పంట చేతికి అందుతుందో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఆయకట్టు పరిధిలో రబీ పంట వేసుకోకూడదని ఇప్పటికే ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు సూచనలు జారీ చేసిన నేపథ్యంలో ఖరీఫ్‌లో సాగు చేసిన పంటను ఎలా దక్కించుకోవాలన్న దానిపై దేవుడిపై భారం వేస్తున్నారు. తుంగభద్ర డ్యాంలో 33 గేట్లలో గత ఏడాది ఒక గేటు కొట్టుకొని పోయిన నేపథ్యంలో మిగిలిన అన్ని గేట్లకు మరమ్మతులు చేసి, కొత్తవి మార్చేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో రబీకి హాలిడే ప్రకటించి నాలుగు నెలల్లో తుంగభద్ర గేట్లన్నింటిని మార్చాలని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో దాదాపు రబీ పంట లేనట్లేనని రైతు ఆవేదన వ్యక్తం చేస్తుండగా ప్రస్తుతం ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలను దక్కించుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఈసందర్భంగా పలువురు రైతులు సాక్షితో మాట్లాడుతూ ఆయకట్టు పరిధిలో ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు వర్ష ప్రభావంతో భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. ఈనేపథ్యంలో రైతులకు ప్రభుత్వం పంట నష్టపరిహారంతో పాటు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని రైతులు అన్నారు.

అన్నదాతల్లో ముసురు భయం1
1/2

అన్నదాతల్లో ముసురు భయం

అన్నదాతల్లో ముసురు భయం2
2/2

అన్నదాతల్లో ముసురు భయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement