భగ్గుమన్న నందిని నెయ్యి ధర
శివాజీనగర: రాష్ట్ర ప్రజలకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) ఉత్పత్తుల ధరలను పెంచి మళ్లీ షాక్‌నిచ్చింది. ఇటీవల జీఎస్‌టీ తగ్గించడం వల్ల నందిని నెయ్యికి డిమాండ్ పెరగడంతో హఠాత్తుగా ధరను పెంచేసింది. ఏకంగా లీటరు నెయ్యి ప్యాకెట్ మీద రూ.90 పెంచడంతో ధర ఇప్పుడు రూ. 700 కు చేరింది. అర్ధ లీటరు నెయ్యి ప్యాకెట్ ధర రూ. 360 వద్ద ఉంది. కొంతకాలంగా కేఎంఎఫ్ పాలు, ఇతర ఉత్పత్తుల ధరలను క్రమం తప్పకుండా పెంచుతూ వస్తోంది. దీంతో కొనుగోలుదారులపై తీవ్ర భారం పడుతోంది. గత కొన్నినెలలుగా పాల ప్యాకెట్ల ధరలను అధికం చేయడం తెలిసిందే. సంస్థ నాణ్యమైన ఉత్పత్తుల పేర్లతో లాభాలను దండుకుంటోందని, ఆ లాభాల్లో పాలు పంపిణీ చేసే పాడి రైతులకు వాటా ఇవ్వడం లేదనే విమర్శలున్నాయి.


