నకిలీ మందు పిచికారీ.. మిర్చి పంట హరీ
సాక్షి,బళ్లారి: కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లుగా పెట్టిన పంటకు తెగులు ఆశించడంతో పంటను కాపాడుకోవడానికి రైతు పురుగుల మందు కొడితే ఆ మందు ప్రభావంతో పంట బాగుండాల్సింది పోయి నకిలీ మందుల వల్ల మొత్తం పంట నాశనం కావడంతో రైతన్న గగ్గోలు పెడుతూ అధికారులను ఆశ్రయించారు. సిరుగుప్ప తాలూకా సిద్దమ్మనహళ్లికి చెందిన రైతు హనుమంతప్ప 2 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని మిర్చి పంట సాగు చేశాడు. మిర్చికి తీవ్రంగా వివిధ రకాల తెగులు సోకడంతో ఆ తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి త్రిజంట కంపెనీకి చెందిన పురుగుల మందును పిచికారీ చేయగా పంట మొత్తం నాశనం కావడంతో రైతు కన్నీరు పెడుతూ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు కరూరు మాధవరెడ్డిని సంప్రదించగా ఆయన నేతృత్వంలో సంబంధిత జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
దెబ్బ తిన్న పంట పరిశీలన
రైతు సాగు చేసిన మిర్చి పంటను సంబంధిత అధికారులు, కంపెనీ మేనేజర్ పరిశీలించి పురుగుల మందు ద్వారా పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే పంట నష్టపరిహారానికి సంబంధించి మీనమేషాలు లెక్కించడంతో రైతు సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఎకరాకు రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టి రెండు ఎకరాలకు దాదాపు రూ.కోటి పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తే నాసిరకం, నకిలీ పురుగుల మందు పిచికారీ చేయడంతో ఉన్న పంట దిబ్బ తిందని, రైతుకు పంట నష్టపరిహారం ఇవ్వక పోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సంబంధిత కంపెనీ వారు, మందుల షాపు యజమాని నైతిక బాధ్యత వహించి రైతుకు న్యాయం చేయాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
పరిహారం ఇవ్వకుంటే ఆందోళన చేస్తాం
రైతు సంఘం నాయకుల హెచ్చరిక
నకిలీ మందు పిచికారీ.. మిర్చి పంట హరీ


