
నాగేంద్ర పీఏపై ఈడీ దాడులు
సాక్షి బళ్లారి: మాజీ మంత్రి, బళ్లారి గ్రామీణ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర ఆప్త సహాయకుడు (పీఏ), వ్యాపారి కురుబ నాగరాజు ఇంటిపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం ఉదయమే ఈడీ అధికారులు మాజీ మంత్రి నాగేంద్రకు సన్నిహితునిగా గుర్తింపు పొందిన తాలూరు రోడ్డులోని నాగరాజు ఇల్లు, ఆఫీసు వచ్చారు. గది గదిలో క్షుణ్ణంగా గాలింపు జరిపారు. ఈ సమయంలో నాగరాజు బెంగళూరులో ఉన్నట్లు తెలిసింది. అయితే ఇంట్లో ఉన్న రికార్డులు, ఇతరత్రా ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కార్వార బెళికెరె పోర్టులో ఇనుప ఖనిజం మాయమైన ఘటనలోనూ నాగరాజు ఇంటిలో ఈడీ సోదాలు చేసింది. కొంతకాలం పాటు జైలుకు కూడా వెళ్లి వచ్చారు.
హొసపేటెలో..
అలాగే హొసపేటెలో ప్రముఖ వ్యాపారి శ్రీనివాస్‌రావు అలియాస్ శ్రీను బాబు ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. హొసపేటెలోని వివేకానంద నగర్, బసవేశ్వరనగర్‌లో ఉన్న ఇళ్లు, ఆఫీసుల్లో ముమ్మరంగా గాలించారు. అతనికి ప్రముఖ హోటల్‌తో పాటు రియల్‌ఎస్టేట్, గనులు వ్యాపారాలున్నాయి. బళ్లారి, విజయనగర రెండు జిల్లాల్లో ఈడీ సోదాలు చేపట్టడం చర్చనీయాంశమైంది.
బళ్లారి, హొసపేటెలో తనిఖీలు