
నిధుల మంజూరులో తారతమ్యం తగదు
సాక్షి,బళ్లారి: ఎమ్మెల్యేలకు నిధుల మంజూరు విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తారతమ్యం చేస్తున్నారని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం కొప్పళ జిల్లా గంగావతి తాలూకా మెటగల్ గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కొత్త సంప్రదాయానికి తెర తీశారన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేస్తే, ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలకు కేవలం రూ.25 కోట్ల నిధులు మంజూరు చేస్తామని ప్రకటించడం ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. నిధులు మంజూరు చేయడంలో సీఎం పక్షపాతం వహించడంతో జేడీఎస్ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు. కొప్పళలో ఇటీవల జరిగిన సీఎం పర్యటన కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం తరహాలో లేకపోవడంతో తాను కాని బీజేపీ ప్రజాప్రతినిధులు కాని హాజరు కాలేదన్నారు. కుకనూరు పీఎస్‌ఐని సస్పెండ్ చేయడంతో రాష్ట్రంలో ప్రజలకే కాదు, పోలీసులకు కూడా రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. సామాన్యులకు జీవించడానికి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. రైతుల పంటనష్టంపై కూడా ప్రభుత్వం సరైన విధంగా రైతులకు న్యాయం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం తన కుర్చీని కాపాడుకునేందుకే సమయం వెచ్చిస్తున్నారన్నారు. పాలన వైపు దృష్టి పెట్టటం లేదని మండిపడ్డారు. ఈసందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు
విపక్షాల ఎమ్మెల్యేలకు రూ.25 కోట్లేనా?
గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి