
మద్దతు ధర కోసం రక్త లేఖ
హొసపేటె: ఉల్లిపాయలకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చెరుకు పెంపకందారుల సంఘం అధ్యక్షుడు ఎన్‌ఎం.సిద్దేష్ ఉత్తంగి బుధవారం ప్రధానమంత్రికి రక్తంతో రాసిన లేఖను పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లి పంటకు వెంటనే క్వింటాల్‌కు రూ.2000–2500ల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి రైతుల సమస్యలపై స్పందించక పోతే కూడ్లిగిలో జరగనున్న ముఖ్యమంత్రి కార్యక్రమంలో రైతులు నల్ల బ్యాడ్జీలను కట్టుకుని నిరసన ప్రదర్శిస్తామని హెచ్చరించారు. ఉల్లి పెంపకందారుల సంఘం నాయకులు సోమన్న, మైనళ్లి కొట్రేష్ పాల్గొన్నారు.
కార్మికుడు మృతి
క్రిష్ణగిరి: మూడంతస్తుల భవనంపై పని చేస్తున్న కార్మికుడు అకస్మాత్తుగా కింద పడటంతో మృతి చెందిన ఘటన సూళగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేరళలోని కొచ్చిన్‌కు చెందిన జోసెఫ్(56) సూళగిరిలో నివాసముంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం సూళగిరి సమీపంలో భవన నిర్మాణ పని చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో మూడంతస్తుల భవనం పైనుంచి అకస్మాత్తుగా జారి కింద పడటంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై సూళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.