
పదిలో మెరుగైన ఫలితాలు సాధించండి
రాయచూరు రూరల్: జిల్లాలో ఈసారి పదవ తరగతిలో మెరుగైన ఫలితాల సాధనపై దృష్టి పెట్టాలని, విద్యా శాఖలో అధికారులు ఇచ్చిన నివేదికలు వేరని, సమావేశంలో చెబుతున్న నివేదికలకు పొంతన లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రితీష్ కుమార్ సింగ్ ధ్వజమెత్తారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయంలో జరిగిన ప్రగతి పరిశీలన సమావేశంలో మాట్లాడారు. పదవ తరగతి, ఇంటర్‌లో ఫలితాలు తగ్గిపోవడానికి కారణాలు అన్వేషించాలని ఉన్నతాధికారులకు సూచనలిచ్చారు. దేవదుర్గ తాలూకాలో 17 పాఠశాలల్లో 40 శాతం, నగరంలో 60 పాఠశాలల్లో 40 శాతం కంటే తక్కువ శాతం ఫలితాలు రావడంపై నివేదికలు అందివ్వాలన్నారు. గృహలక్ష్మి నిధులు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. హాస్టల్‌లో విద్యార్థులకు మంచి ఆహారం అందించాలన్నారు. బయోమెట్రిక్‌ను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో వరి, పత్తి, కంది, జొన్న, ఇతర పంటలు వర్షాల వల్ల నష్టపోయిన అంశాలపై రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారుల సంయుక్త సర్వేలు చేసి నివేదికలను అందించాలన్నారు. సమావేశంలో జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఏసీ గజానన, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, ఉప కార్యదర్శి సిద్దప్ప, అధికారి రోణ, చంద్రశేఖర్ పవార్, శరణబసవలున్నారు.