
చిత్రదుర్గ, బాగలకోటెల్లోనూ ఇదే పరిస్థితి
రాష్ట్రంలో అత్యధికంగా ఉల్లి సాగు చేసే చిత్రదుర్గ, బాగల్‌కోటె జిల్లా రైతుల పరిస్థితి కూడా ఇలానే కనిపిస్తోంది. ఏ రైతు పొలంలో చూసినా ఉల్లి పంట కనిపిస్తుందే కానీ పంట తీయడానికి కూడా రైతులకు ఉత్సాహం కనిపించడం లేదు. ఈనేపథ్యంలో ప్రభుత్వం కదిలివచ్చి ఉల్లిసాగు చేసిన రైతులను ఆదుకోవాలని కర్ణాటక ప్రాంత రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాధవరెడ్డి డిమాండ్ చేశారు. దేశంలో మహారాష్ట్ర తర్వాత కర్ణాటకలో లక్షలాది ఎకరాల్లో ఉల్లి పంటను రైతులు సాగు చేశారన్నారు. ఒక్క ఉమ్మడి బళ్లారి జిల్లాలోనే 80 వేలకు పైగా ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేశారన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షలకు పైగా ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేశారన్నారు. ప్రతి రైతు లక్షలాది రూపాయలను నష్టపోయారన్నారు. ఎకరానికి ప్రభుత్వం కనీసం రూ.50 వేలను పంట నష్టపరిహారంగా అందించాలని కోరారు. రైతుల నుంచి ప్రభుత్వమే ఉల్లిని కొనుగోలు చేసి వినియోగదారులకు విక్రయించాలన్నారు. వ్యాపారులు రైతుల నుంచి కిలో రూ.5ల లోపు ధరకే కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.