
ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరసన
హొసపేటె: ఖాళీగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగార్ధుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సర్కిల్ నుంచి నిరసన ప్రదర్శనగా వచ్చిన ఆందోళనకారులు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. నిరసనను ఉద్దేశించి పోరాట కమిటి నేత, కవి పీర్ బాషా మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల హక్కులను కాపాడాలని అన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను సత్వరం భర్తీ చేయాలని, నియామకాల్లో పారదర్శకత పాటించాలన్నారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నియామకాలు జరగనందున వయో పరిమితిలో సడలింపు ఇవ్వాలని తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. అనంతరం వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు.