
వైద్య శిబిరానికి స్పందన
రాయచూరు రూరల్: పేదలు ఉచిత ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని నగర సభ ప్రొబేషన్ కమిషనర్ పురురాజ్ సింగ్ సోలంకి, సభ్యుడు రమేష్ పేర్కొన్నారు. ఆదివారం ఆజాద్ నగరంలోని వి.జి.కులకర్ణి ఆస్పత్రిలో ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ముందు జాగ్రత్తలు పాటించి వ్యాధి నివారణకు సలహాలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో విజి కులకర్ణి, ఆస్పత్రి వైద్యుడు అజిత్ కులకర్ణి, హరీష్, అమరేష్, దండెప్ప బిరదార్ తదితరులు పాల్గొన్నారు. శిబిరంలో 150 మందికి వైద్య చికిత్సలు చేశారు.
2న మైలార లింగేశ్వర కార్నికోత్సవం
హుబ్లీ: తాలూకాలోని అమరగోళ అధ్యాపక నగర్‌లో వెలసిన లింగేశ్వర దేవస్థానంలో మాళతేశ స్వామి దసరా ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 2న సాయంత్రం 5 గంటలకు కార్నికోత్సవం జరగనుంది. ఈనెల 30 దుర్గాష్టమి, అక్టోబర్ 2న మహానవమి, అక్టోబర్ 2 విజయదశమి సందర్భంగా ఉదయం 11:15 గంటలకు పల్లకీ ఉత్సవం, మధ్యాహ్నం 3 గంటలకు జాతర, సాయంత్రం 5:15 గంటలకు గురువుల ఆశీర్వాదంతో కార్నికోత్సవం నిర్వహించనున్నారు. జమ్మిపత్రి సమర్పణ కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదానం చేస్తారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని మైలార లింగేశ్వర దేవస్థాన కమిటీ సభ్యులు కోరారు.
దివ్యాంగులకు స్కాలర్‌షిప్స్
హుబ్లీ: దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత, మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు స్కాలర్‌షిప్స్ మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. 40 శాతం అంతకంటే ఎక్కువ అంగవైక్యలం కలిగిన వారు స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం 9, 10వ తరగతుల విద్యార్థులు ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్ నుంచి పీజీ చదువుతున్న విద్యార్థులు అక్టోబర్ 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీ, పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌కు తల్లిదండ్రులు వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల్లోపు ఉండాలి. ఇంటర్ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.8 లక్షల్లోపు ఉండాలి. దేశ వ్యాప్తంగా 25 వేల మందికి ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్స్, 17 వేల మందికి పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్స్, టాప్‌క్లాస్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్స్ 300 మందికి మంజూరు చేస్తామని జిల్లా వృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారిణి కవిత ఓ ప్రకటనలో తెలిపారు.
సాంఘిక సంక్షేమ శాఖ అధికారి సస్పెండ్
రాయచూరు రూరల్: రాష్ట్రంలో జరుగుతున్న కులగణన సమీక్షలో నిర్లక్ష్యం వహించిన అధికారిని సస్పెండ్ చేశారు. రాయచూరు జిల్లా లింగసూగురు తాలుకా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రమేష్ రాథోడ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఆదివారం తహసీల్దార్ సత్యమ్మ ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా అధికారి నితీష్ రాథోడ్ విచారణ చేపట్టారు. విధుల నిర్వహణలో అలసత్వం, బీఎల్‌ఓలకు సహకారం అందించ పోవడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ముగ్గురిపై వేటు
బళ్లారి రూరల్: దావణగెరె జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులు, సిబ్బంది ఒకరిని శనివారం జిల్లా అధికారి జి.ఎం.గంగాధరయ్య స్వామి సస్పెండ్ చేశారు. జిల్లాలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 7 వరకు సామాజిక, శైక్షిణిక సమీక్ష నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జమాపురం ప్రాథమిక పాఠశాల సహ ఉపాధ్యాయుడు డి.కె.మంజునాథ్, దావణగెరె ఉత్తర వలయ వ్యాయామ ఉపాధ్యాయుడు హెచ్.బసవరాజును సస్పెండ్ చేశారు. అదేవిధంగా సిబ్బంది కె.ఆర్.దుర్గప్పను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.