
ఉల్లి ధరలు ఢమాల్
సాక్షి, బళ్లారి/హొసపేటె/హుబ్లీ: ఈ ఏడాది ఉల్లి ధరలు భారీగా పతనమయ్యాయి. దేశంలో ఉల్లిగడ్డలు సాగు చేసే రాష్ట్రాల్లో మహారాష్ట్ర తర్వాత కర్ణాటక అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో ఉల్లి ధరలు ఆశాజనకంగా ఉండటంతో హావేరి, బాగల్‌కోట, చిత్రదుర్గం తదితర జిల్లాల్లో వేలాది ఎకరాల్లో రైతులు ఉత్సాహంగా ఉల్లి సాగు చేశారు. విజయనగర జిల్లాలో ఈ సంవత్సరం 6,300 హెక్టార్ల విస్తీర్ణంలో ఉల్లి సాగు చేశారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, మంచు కారణంగా 50 శాతానికి పైగా పంట దెబ్బతింది. ఉల్లికి మజ్జిగ వ్యాధి, ట్విస్టర్ వ్యాధి, తెగుళ్లు సోకాయి. పంట నాణ్యత లేకపోవడంతో ధరలు పడిపోయాయి. ధర ఒక్క సారిగా క్వింటాల్ రూ.300 పడిపోయింది. దళారులు, వ్యాపారులు, బ్రోకర్లు ఉల్లిని రిటైల్ వ్యాపారులకు మంచి ధరకు అమ్ముతున్నారని రైతులు భీమన్న సోము, దళవాయి వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పంట సాగుకు చేసిన పెట్టుబడి ఖర్చు కూడా రాలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉల్లికి సరైన మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు. ఒక వైపు భారీ వర్షాలు మరో వైపు పడిపోయిన ధరలతో హావేరి రైతన్నలు ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హవేరి జిల్లాలో 744 హెక్టార్ల ప్రాంతంలో ఉల్లి సాగు చేశారు. అయితే విఫరీతమైన వానలతో నాణ్యత లేకుండా పంట మారడంతో పైగా సగం పంట భూమిలోనే కుళ్లి పోయింది. ఉన్న ఫలంగా క్వింటా రూ.300లకు పడిపోవడంతో రైతన్నలు దిగులు చెందుతున్నారు. ఎకరాకు రూ.20 వేలు పెట్టుబడి పెట్టి తక్కువ ధరకు విక్రయించడంతో వాహనం అద్దెకు కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. ఒక్క హావేరిలోనే కాక బాగళకోట జిల్లాలోని ముదోళ, బాదామి తాలూకాల్లోని సివికేరి, నీరళగేరి, భగవతి, హొన్నకట్టి, అలాగు ముదోళ తాలూకాలోని లోకపుర, బోమ్మనగుడ్ని, మెట్టగుడ్డ, తిమ్మపురలో సాగు చేసిన ఉల్లి పరిస్థితి కూడా దయనీయంగా మారింది. సంబంధిత అధికారులు తక్షణమే దృష్టి సారించి పంట నష్ట పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
లబోదిబోమంటున్న రైతులు

ఉల్లి ధరలు ఢమాల్