
నకిలీ బంగారం.. రూ.65 లక్షలు మాయం
కృష్ణరాజపురం: బంగారం రేటు భారీగా పెరగడంతో మోసాలు చేసేవారికి అనువుగా మారింది. నకిలీ బంగారాన్ని అసలు బంగారమంటూ విక్రయించిన కోలారుకు చెందిన ఖతర్నాక్ ముఠాను హొసకోటె పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నగర శివారు ప్రాంతాలనే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ముఠా హొసకోటె, నందగుడి, శిడ్లఘట్టల్లో ఎనిమిది మందికి రూ.65 లక్షలు టోకరా వేసింది. తాలూకాఫీసు, హోటళ్ల వద్ద తెలుగులో మాట్లాడేవారిని గమనించి, వారితో ఎంతో తీయగా మాట్లాడేవారు. కేరళలో ఒక చోట భూమి చదును చేసే పనిని చేస్తుండగా రాజుల కాలంనాటి బంగారు గొలుసు దొరికిందని నమ్మిస్తారు. రెండు అసలైన బంగారు గుండ్లను చూపించి, ఇవి గొలుసులోనివని చెబుతారు. ఎనిమిది కేజీల బంగారు హారాన్ని తక్కువ ధరకు ఇస్తామని చెప్పి కొందరికి ఫలానా చోటుకు రమ్మన్నారు. అక్కడికి వెళ్లగా నకిలీ గొలుసును ఇచ్చి రూ.65 లక్షలను తీసుకుని వెళ్లిపోయారు. ఇంటికి వచ్చి పరిశీలించిన కొనుగోలుదారులు అది నకిలీదని తెలిసి నివ్వెరపోయారు. హొసకోటె పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు జరిపి ప్రధాన నిందితుడు రాజేష్ తో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు.
తెలుగువారే లక్ష్యం
కోలారు ముఠా పట్టివేత

నకిలీ బంగారం.. రూ.65 లక్షలు మాయం