
రోడ్లపై కళ్లు మూసుకుని తిరుగుతున్నారా?
బనశంకరి: రోడ్లపై కళ్లు మూసుకుని తిరుగుతున్నారా? రోడ్ల పక్కన ఉన్న చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకోరా అని సీఎం సిద్దరామయ్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం ఆయన బెంగళూరులో నగర పర్యటన చేశారు. బళ్లారి రోడ్డు విండ్సర్ మ్యానర్ సర్కిల్ డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో నీరు నిలుస్తుందని అధికారులు తెలిపారు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని గ్రేటర్ అధికారులకు సూచించారు. విండ్సర్ మ్యానర్ సర్కిల్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రింగ్ రోడ్డులో కట్టడ వ్యర్థాలు పడేయడంతో అసహనం వ్యక్తం చేశారు. చెత్త పడేసిన వారిని కనిపెట్టి వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేయాలన్నారు. హెణ్ణూరు ఫ్లై ఓవర్ కింద ఉన్న కట్టడ నిర్మాణ వ్యర్థాలు, చెత్తను 24 గంటల్లోపు తొలగించాలని తెలిపారు. బీస్మైల్ సాంకేతిక డైరెక్టర్ ప్రహ్లాద్‌కు నోటీస్ ఇవ్వాలని సూచించారు. వార్డు నంబరు 23లో పొడిచెత్త సేకరణ కేంద్రం లోపల ఉండాల్సిన చెత్త బయటి ఉండటాన్ని గమనించిన ముఖ్యమంత్రి.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ నుంచి కొద్ది దూరంలో రోడ్డులో కంకరజెల్లి పడటాన్ని గమనించి దీనికి కారణమైన ఇంజనీర్ రాఘవేంద్ర ప్రసాద్‌కు నోటీసులు ఇవ్వాలని సూచించారు. హెణ్ణూరు బాగలూరు వైట్ టాపింగ్ రోడ్డుపై గుంతలు పూడ్చేందుకు కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమర్థవంతంగా వైట్ టాపింగ్ రోడ్లు నిర్వహణ చేపట్టని కాంట్రాక్టర్లు, ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు బైరతి సురేశ్, కేజే జార్జ్ పాల్గొన్నారు.
అధికారులపై సీఎం సిద్దరామయ్య ఆగ్రహం