
పసివయసులో ప్రేమభూతం
●యువకుడు, బాలిక ఆత్మహత్య
మాలూరు: చదువుకుని ఉన్నత జీవితానికి బాటలు వేసుకోవాల్సిన పసివయసులో ప్రేమ మాయలో పడి ఓ అమ్మాయి, అబ్బాయి ప్రాణాలు తీసుకున్నారు. కన్నవారికి జీవితాంతం శోకాన్ని మిగిల్చిన ఈ దుర్ఘటన కోలారు జిల్లాలో జరిగింది. రైలు కింద పడి ప్రేమికుల జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన తాలూకాలోని బ్యాటరాయనహళ్లి వద్ద చోటు చేసుకుంది. వివరాలు.. టీకల్ ఫిర్కా శెట్టిహళ్లి గ్రామానికి చెందిన సతీష్ (18), పనసమాకనహళ్లి అమ్మాయి (17), వీరిద్దరూ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. వేర్వేరు కులాలు కావడంతో ఇంట్లో తమ ప్రేమకు అంగీకరించరని, తాము కలిసి జీవించలేమని తెలిసీ తెలియని వయసులో ఏదేదో ఊహించుకున్నారు. గురువారం ఉదయం బ్యాటరాయనహళ్లి వద్ద బెంగళూరుకు వెళ్లే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. సతీష్ బుధవారమే పుట్టిన రోజు జరుపుకున్నాడు. రైలు తాకిడికి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. బెంగళూరు కంటోన్‌మెంట్ రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందించారు.
హిందీ భేటీలో కరవే రచ్చ
● పంచతార హోటల్‌లో ఘటన
శివాజీనగర: కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని రాజ భాషా కమిటీ బెంగళూరులోని తాజ్‌వెస్ట్‌ఎండ్ హోటల్‌లో గురువారం హిందీ ప్రచార సభని నిర్వహించగా, కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు, నేతలు చొరబడి రభస సృష్టించారు. వందలాది మంది కార్యకర్తలు హోటల్‌లోకి దూసుకొచ్చారు. ఆరుమంది పార్లమెంట్ సభ్యుల సమక్షంలో జరుగుతున్న కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కొంతసేపు ఉద్విగ్న పరిస్థితి ఏర్పడింది. హిందీని హిందీయేతర రాష్ట్రాలపై బలవంతంగా రుద్దే పని చేస్తున్నారని కార్యకర్తలు ఆరోపించారు. కొంతసేపటికి హైగ్రౌండ్స్ పోలీసులు చేరుకుని కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ గొడవతో సమావేశానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది.
నీటి ట్యాంకర్ ఢీ, బైకిస్టు మృతి
దొడ్డబళ్లాపురం: బైక్‌ను వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ ఢీకొన్న సంఘటనలో తండ్రి మృతి చెందగా, కుమారుడు తీవ్రంగా గాయపడ్డ సంఘటన బెంగళూరు వైట్‌ఫీల్డ్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. మునిరాజు (52), కుమారుడు ధనంజయ్‌గౌడ (16) నాగగొండనహళ్లి నుండి ఇమడిహళ్లి వైపు బైక్‌పై వెళ్తుండగా దారిమధ్యలో సాయి సన్‌షైన్ అపార్ట్‌మెంట్ ముందు ఎదురుగా వచ్చిన వాటర్ ట్యాంకర్ ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ వైదేహి ఆస్పత్రికి తరలించగా మునిరాజు చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
దావణగెరెలో ఫ్లెక్సీ ఘర్షణ
దొడ్డబళ్లాపురం: ఓ మతపరమైన ఫ్లెక్సీ దావణగెరెలో చిచ్చు రేపింది. ఘర్షణ జరిగి పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలు.. దావణగెరెలోని కార్ల్ మార్క్ నగరలోని 13వ క్రాస్‌లో ఓ ఇంటి ముందు ఓ మతంవారు ఫ్లెక్సీని కట్టారు. ఇక్కడ ఎందుకు కట్టారని ఇంటి వారు ప్రశ్నించడంతో వారిపై దాడికి పాల్పడ్డారు. ఇంటి మీద రాళ్లు విసిరారు. ఒక మతానికి చెందిన సుమారు 500 మందిపైగా జనం అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది, కొట్టుకుని పలువురు గాయపడ్డారు. గొడవలపై రెండు కేసులు నమోదు చేసినట్టు దావణగెరె ఎస్పీ ఉమా ప్రశాంత్ తెలిపారు. ప్రశాంత వాతావరణం నెలకొందని, సదరు ఫ్లెక్స్‌ని తొలగించామని తెలిపారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయవద్దని ప్రజలను హెచ్చరించారు.
ఆడని సినిమా..
ప్రేక్షకుల హంగామా
చింతామణి: పట్టణంలోని ఎంజీ రోడ్డులో ఉన్న ఆదర్శ సినిమా టాకీసులో బుధవారం రాత్రి ఓ కొత్త తెలుగు సినిమా ప్రీమియర్ షో వేస్తామని రూ.400 చొప్పున టికెట్లను అమ్ముకున్నారు. 300 మంది ఆన్‌లైన్‌లో టికెట్లను కొని సినిమాచూడాలని వచ్చారు. అయితే ఎంతసేపయినా షో మొదలు కాలేదు. సినిమా చిప్ డౌన్‌లోడు కాలేదంటూ షోను రద్దు చేస్తున్నట్లు టాకీస్ సిబ్బంది ప్రకటించారు. దీంతో ఆగ్రహానికి లోననైన ప్రేక్షకులు సినిమా తెరను చించి, సీసీ కెమెరాలు, చైర్లు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి కిష్కింధకాండ చేశారు. పట్టణ సీఐ విజికుమార్, పోలీసులు, ఇతర ఠాణాల నుంచి పోలీసులు వచ్చారు. ప్రేక్షకులను టాకీస్ నుంచి బయటకు పంపించగా, వారు బయట ధర్నాకు దిగారు. సినిమాను చూపించాలి, లేదా డబ్బయినా వెనక్కి ఇవ్వాలని పట్టుబట్టారు. డబ్బులు ఇస్తామని యజమాని హామీ ఇచ్చాడు, సినిమా చూపాలని ప్రేక్షకులు గొడవ చేశారు. ఇక్కడే ఉంటే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు. చివరకు అర్ధరాత్రి అందరూ వెళ్లిపోయారు, గురువారం టికెట్ల డబ్బులను వెనక్కి ఇచ్చారు.

పసివయసులో ప్రేమభూతం

పసివయసులో ప్రేమభూతం