
లోకాయుక్త వలలో నగరసభ ఇంజనీరు
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం నగరసభ ఇంజనీరు అరుణ్ ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ లోకాయుక్తకు దొరికిపోయాడు. వివరాలు.. నగరంలోని పలు వార్డులలో ఓ కాంట్రాక్టరు పనులు చేశాడు, వాటి బిల్లులను మంజూరు చేయాలని ఇంజనీరు అరుణ్‌కు దరఖాస్తు చేశారు. రూ. 75 వేలు లంచం ఇవ్వాలని అరుణ్ సతాయించసాగాడు. డబ్బు ఇవ్వకపోతే పని జరగదని కిరికిరి పెట్టాడు. దీంతో బాధితుడు లోకాయుక్త అధికారులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం సాయంత్రం అరుణ్ లంచం డబ్బు తీసుకుంటూ ఉండగా లోకాయుక్త అధికారులు దాడి చేసి అరుణ్‌ని అరెస్టు చేశారు.
పోలీసును బలిగొన్న హైనా
దొడ్డబళ్లాపురం: రోడ్డుపై వెళ్తుండగా హైనా అనే జంతువు అడ్డు రావడంతో దాన్ని ఢీకొన్న పోలీస్ జీప్ ప్రమాదానికి గురై ఏఎస్‌ఐ చనిపోయాడు. గదగ్ జిల్లా సొరటూర గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. వివరాలు.. బెటగేరి ఠాణా ఏఎస్‌ఐ ఖాసీంసాబ్, కొందరు పోలీసులు ఈ నెల 23న జీపులో లక్ష్మేశ్వరలో వినాయక నిమజ్జనం బందోబస్తును చూసుకుని తిరిగి వస్తున్నారు. రోడ్డుపై హఠాత్తుగా అడవి జంతువు హైనా అడ్డు వచ్చింది. దీంతో డ్రైవర్ అదుపు తప్పడంతో జీపు రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖాసీంసాబ్ గురువారంనాడు చనిపోయారు. ఇన్స్‌పెక్టర్ ఉమేశ్ గౌడ, డ్రైవర్ ఓంనాథ్‌కు గాయాలయ్యాయి. ఖాసీం మరో 5 నెలల్లో రిటైరు కావాల్సి ఉండగా ఇలా జరిగింది.
దర్శన్‌కు దక్కని ఊరట
● సదుపాయాలపై విచారణ వాయిదా
యశవంతపుర: రేణుకాస్వామి హత్య కేసులో మళ్లీ పరప్పన జైలుపాలైన ప్రముఖ నటుడు దర్శన్‌కు ఊరట దక్కడం లేదు. జైల్లో పరుపు, దిండు సౌకర్యం, బయట వాకింగ్ వసతిని కల్పించాలని బెంగళూరు సిటీ 57వ సివిల్ కోర్టులో దర్శన్ గతంలో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ఆ వసతులను ఇవ్వాలని కోర్టు కూడా ఆదేశించింది. అయితే జైలు అధికారులు పట్టించుకోవడం లేదని దర్శన్ వకీలు వాదించారు. గురువారం దర్శన్ కోర్టుకు హాజరయ్యారు. వాకింగ్ చేయడానికి, ఆరుబయట ఉండడానికి జైలు అధికారులు అనుమతించడం లేదని దర్శన్ జడ్జికి వివరించాడు. సాధారణ సెల్‌కు బదిలీ చేయాలని దర్శన్ న్యాయవాది మనవి చేశారు. ఇదీ రౌడీల రాజ్యమా?, కోర్టు ఆదేశాలను జైలు సిబ్బంది పాటించటం లేదు అని ఘాటుగా అన్నారు. మరో నిందితురాలు పవిత్రగౌడను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి విచారించారు. విచారణను వచ్చే నెల 9 కి వాయిదా వేశారు. రేణుకాస్వామి హత్య కేసుతో తనకు సంబంధం లేదని, విముక్తి చేయాలని దర్శన్ మరో పిటిషన్‌ను వేశాడు. తనను కావాలనే ఇరికించారని అందులో పేర్కొన్నాడు.
సరస్వతీపుత్ర భైరప్పకు కన్నీటి నివాళి
శివాజీనగర: బెంగళూరులో బుధవారం కన్నుమూసిన పద్మభూషణ్, సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత, సాహితీవేత్త ఎస్.ఎల్.భైరప్పకు సాహితీలోకం కన్నీటినివాళి అర్పిస్తోంది. గురువారం బెంగళూరులోని జే.సీ.రోడ్డులో ఉన్న రవీంద్ర కళాక్షేత్రానికి ఆయన పార్థివదేహాన్ని తీసుకువచ్చారు. అక్కడ వేలాదిమంది ప్రజలు, అభిమానులు, రచయితలు అంతిమ దర్శనం చేసుకున్నారు. సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్, మంత్రులు నివాళులర్పించారు. మైసూరులో భైరప్ప స్మారకాన్ని నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు. శుక్రవారం మైసూరు చాముండి కొండ వద్ద తప్పలి శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి.

లోకాయుక్త వలలో నగరసభ ఇంజనీరు

లోకాయుక్త వలలో నగరసభ ఇంజనీరు