
డ్రాప్ పేరుతో దోపిడీలు
● ఐటీ సిటీలో ఘరానా ముఠా అరెస్టు
యశవంతపుర: కారులో డ్రాప్ ఇస్తామని నమ్మించి తుపాకులు చూపి దోచుకునే నలుగురి సభ్యుల ముఠాను బెంగళూరు పీణ్య పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా దోపిడీలు ఇలా బయటపడ్డాయి. ఓ వ్యక్తి ఆగస్ట్ 14న రాత్రి విజయనగరకు వెళ్లడానికి పీణ్య జాలహళ్లి బస్టాప్‌లో నిలిచి ఉండగా ఓ కారు వచ్చింది. తాము విజయనగరకు డ్రాప్ చేస్తామని కారులో ఎక్కించుకున్నారు. దాబస్‌పేటకు వెళ్లగానే కారులోని దుండగులు పిస్టల్‌ను చూపించి ఆ వ్యక్తిని బెదిరించారు. అతని వద్ద ఉన్న రూ.75 వేలు నగదు, రెండు మొబైల్‌ఫోన్లను లాక్కుని కారులో నుంచి తోసేశారు. బాధితుడు పీణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అప్పటి నుంచి పలు విధాలుగా విచారణ చేపట్టారు. చివరకు మారతహళ్లి దొడ్డనక్కుందిలోని రూంలో ముగ్గురు నిందితులు ప్లాన్ వేసినట్లు బయట పడింది. ముగ్గురినీ అరెస్టు చేశారు. బిజాపుర జిల్లాకుచెందిన వ్యక్తి పిస్టల్‌ను సమకూర్చాడు. అతనిని కూడా అరెస్టు చేసి విచారణ చేపట్టారు. నిందితుల నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, పిస్టల్, కారుతో పాటు రూ.4 లక్షల సొత్తును స్వాఽధీనం చేసుకున్నారు.
కాముక డ్రిల్‌మాస్టర్‌పై కేసు
● మహిళలతో అనైతిక సంబంధాలు
బనశంకరి: అతడు ఓ స్కూల్‌లో డ్రిల్ మాస్టర్, క్రికెట్ కోచ్. కానీ ప్రవృత్తి మాత్రం మహిళలను లోబర్చుకోవడం. విడాకులు తీసుకున్న మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన కామాంధునిపై బెంగళూరు కోణణకుంటె పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలు.. ఓ ప్రైవేటు పాఠశాల పీఈటీ అభయ్ మాథ్యూకు, కుమార్తెను క్రికెట్ శిక్షణకు వదిలేందుకు వచ్చే మహిళతో పరిచయమైంది. ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించి కామవాంఛలు తీర్చుకోసాగాడు. ఆమె ఓసారి అభయ్ మొబైల్‌ఫోన్‌ని చూసి షాక్ కు గురైంది. ఆమెతో పాటు అనేక మంది మహిళల అశ్లీల వీడియోలు అందులో ఉన్నాయి. అతడే వాటిని చిత్రీకరించి సేవ్ చేసుకున్నాడు. ఆమె కోపం పట్టలేక నిలదీయగా, నిన్ను పెళ్లి చేసుకునేది లేదని బెదిరించాడు. బాధిత మహిళ కోణణకుంటే ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కాముక కోచ్‌పై కేసు నమోదుచేశారు. తనతో పాటు అనేకమంది మహిళల నగ్న వీడియోలు అతని వద్ద ఉన్నాయి, స్కూలు విద్యార్థినులతో కూడా అశ్లీలంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె ఆరోపించింది. నిందితుడు పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు.
హత్య కేసులో ఎమ్మెల్యేకు అరెస్టు భయం
శివాజీనగర: గత నెల బెంగళూరులో హలసూరు ఠాణా పరిధిలో రౌడీషీటర్ బిక్లు శివకుమార్‌ను కొందరు దుండగులు హత్య చేయడం తెలిసిందే. ఈ కేసులో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బైరతి బసవరాజ్‌ను 5వ నిందితునిగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఆ కేసు నుంచి విముక్తి ఇవ్వాలని ఆయన హైకోర్టుకు వెళ్లారు. ఆయనను అరెస్టు చేసి విచారించాల్సిందే, ఆయనకు ఉన్న భద్రతను తొలగించాలని ప్రభుత్వ న్యాయవాది బుధవారం హైకోర్టు విచారణలో కోరారు. విచారణకు భైరతి బసవరాజ్ సహకరిస్తున్నారని, పోలీసుల చర్యలు సరికాదని ఎమ్మెల్యే ప్లీడర్లు పేర్కొన్నారు. రాజకీయ వేధింపులకు గురిచేయరాదన్నారు. ఎన్నిరోజుల పాటు కస్టడీకి కావాలని న్యాయమూర్తి.. ప్రభుత్వ న్యాయవాదిని అడిగారు. అభ్యంతరాలు ఉంటే సమర్పించాలని బైరతికి సూచించారు. ఈ కేసులో ఎమ్మెల్యేను పోలీసులు రెండుసార్లు విచారించారు.