
కులగణనకు వంద ఇబ్బందులు
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండోదఫా ప్రారంభించిన కులగణన నత్తనడకన సాగుతోంది. 22వ తేదీన తొలిరోజు 20 లక్షల ప్రజల మంది సమాచారం సేకరించాలి అని లక్ష్యంగా పెట్టుకుంటే, కేవలం 10 వేల మంది సమాచారం మాత్రమే సాధ్యమైంది. వివిధ రకాల గందరగోళాలు తలెత్తాయి.
ఇవీ కొన్ని సమస్యలు
● మొత్తం 2 కోట్ల ఇళ్లలో ఏడు కోట్లకు పైగా ఉన్న ప్రజలందరి సమాచారాన్ని సేకరించాలి. మంగళవారం కూడా వేగం పుంజుకోలేదు.
● వివరాలను నమోదు చేసే మొబైల్ యాప్ ఎంతో నెమ్మదిగా పని చేస్తుండడంతో ఉపాధ్యాయులు విసిగిపోతున్నారు.
● యాప్ వినియోగం గురించి సిబ్బందికి అవగాహన రాలేదు. కొన్ని చోట్ల నెట్ రావడం లేదు. ఇంకొందరికి కిట్లు అందలేదు.
● ఆధార్ నంబర్ ద్వారా కేవైసీ చేస్తున్నప్పుడు ఓటీపీ ఆలస్యంగా వస్తోంది. కొందరికి ఓటీపీలే రావడం లేదు.
● యాప్ ఓపెన్ కావడం లేదని, క్రాష్ అవుతోందని ఎక్కువ మంది ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా కులగణన సమస్యల్లో చిక్కుకుంది.
● రాష్ట్ర జనాభాలో 20 శాతం ఉన్న బెంగళూరులో ఇప్పటివరకు సమీక్ష ప్రారంభం కాలేదు.
నత్తనడకన సర్కారు కార్యక్రమం
ఇంటర్‌నెట్, యాప్‌లో లోపాలు
ఇబ్బందులను తొలగిస్తాం: మంత్రి
యశవంతపుర: సామాజిక విద్యా సమీక్షపై రెండు రోజుల నుంచి ఏర్పడిన ఇబ్బందులపై అధికారులతో చర్చించి తీర్చేస్తామని మంత్రి శివరాజ తంగడిగి తెలిపారు. ఆయన బుధవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి, సర్వర్ సమస్య కారణంగా జనగణన ఆలస్యం అవుతోందని అన్నారు. సర్వర్ సమస్యను అధికారులతో చర్చించి రేపోమాపో పరిష్కరిస్తామన్నారు. జనగణనపై హైకోర్టులో కేసులు దాఖలైనట్లు ప్రస్తావించగా, కోర్టు తీర్పు వచ్చే వరకు ఏమీ మాట్లాడనన్నారు. అక్టోబర్ 7 వరకు జనగణన ఉంటుంది, తేదీని పొడిగింపును పరిశీలిస్తామన్నారు.

కులగణనకు వంద ఇబ్బందులు