
ఆన్‌లైన్ ట్యాక్సీ సేవలు అరికట్టండి
సాక్షి,బళ్లారి: బెంగళూరు తరహాలో గుట్టుచప్పుడు కాకుండా బళ్లారిలో కూడా ద్విచక్ర వాహనాలు ఆన్‌లైన్ ట్యాక్సీ సేవలు అందిస్తున్నాయని, మొబైల్ యాప్‌ల ద్వారా ర్యాపిడో, ఓలా, ఇతర యాప్‌లను ఉపయోగించి ద్విచక్ర వాహనాల్లో ఆటోల తరహాలో పని చేస్తున్నాయని, దీంతో ఆటో యజమానులకు, డ్రైవర్లకు తీవ్ర సమస్యలు, నష్టాలు ఏర్పడుతున్నాయని ఆటో డ్రైవర్లు, యజమానుల సంఘం అధ్యక్షుడు హుండేకర్ రాజేష్ మండిపడ్డారు. బుధవారం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నగరంలోని కనకదుర్గమ్మ గుడి వద్ద నుంచి అండర్ బ్రిడ్జి, రాయల్ సర్కిల్, జిల్లాధికారి కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి అదనపు జిల్లాధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఆటో యూనియన్లకు కమ్మరచేడు కళ్యాణ స్వామీజీ కూడా మద్దతు తెలిపారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల ఆన్‌లైన్ ట్యాక్సీ సేవల వల్ల తాము జీవనోపాధి కోల్పోతున్నామన్నారు. తాము రోడ్డు ట్యాక్స్ తదితరాలను ప్రభుత్వానికి చెల్లించి పని చేసుకుంటుంటే తక్కువ నగదుతో ద్విచక్ర వాహనాల్లో కొందరు వ్యాపారాలు చేసుకుంటున్నారని వాపోయారు. ఇప్పటికే ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మహిళలకు ఏర్పాటు చేయడం వల్ల ఎంతో నష్టపోతున్నామన్నారు. ద్విచక్ర వాహనాలు మొబైల్ యాప్‌లతో పని చేస్తుండటం వల్ల మరింత నష్టాన్ని చవిచూస్తున్నామన్నారు. సుజయ్, హుండేకర్ రాకేష్, ఇమామ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆటో యూనియన్ల నాయకుల ఆందోళన