
ఆ కులాలను ఎస్టీ జాబితాలోకి చేర్చవద్దు
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలను పక్కన బెట్టి కులమతాల మధ్య ఏదో రకంగా వైషమ్యాలు ఏర్పరచడంతో పాటు బలిష్టమైన కులాలను ఎస్టీ జాబితాలోకి చేర్చేందుకు ప్రయత్నిస్తుండటం బాధాకరం అని రాష్ట్ర ప్రభుత్వ తీరును ఖండిస్తూ గురువారం నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నట్లు రాష్ట్ర వాల్మీకి ఐక్య వేదిక అధ్యక్షుడు జోళదరాశి తిమ్మప్ప పేర్కొన్నారు. బుధవారం ఆయన నగరంలోని పత్రికా భవనంలో విలేకరులతో మాట్లాడారు. విద్యా పరంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలపడిన కురుబ, ఇతర సమాజాలను ఎస్టీ జాబితాలోకి చేరుస్తుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గురువారం ప్రభుత్వ తీరును ఖండిస్తూ వాల్మీకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నామన్నారు. వాల్మీకి గురుపీఠం స్వామీజీ ఆశీస్సులతో అన్ని జిల్లా, తాలూకా కేంద్రాల్లో ఆందోళన నిర్వహిస్తామన్నారు. అనంతరం స్వామీజీ సమక్షంలో వాల్మీకి సమాజానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితరులతో ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటామన్నారు. ఈ రిజర్వేషన్ అమలు జరిగితే వాల్మీకులకు ఎంతో నష్టం జరుగుతుందన్నారు. సీఎం సిద్దరామయ్య హిట్లర్ తరహాలో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సమాజ ప్రముఖులు జనార్ధన, జయరాం, రుద్రప్ప తదితరులు పాల్గొన్నారు.
నేడు బళ్లారిలో పెద్ద ఎత్తున ఆందోళన
వాల్మీకి నాయక ఐక్య వేదిక రాష్ట్యాధ్యక్షుడు తిమ్మప్ప