
రూ.200 మల్టీప్లెక్స్ టికెట్‌కు బ్రేక్
శివాజీనగర: బెంగళూరుతో పాటు రాష్ట్రంలో మల్టీప్లెక్స్ సినిమా హాళ్లలో ఏకరూపంగా ఉండేలా టికెట్‌లను రూ.200కు విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశించడం తెలిసిందే. దీని వల్ల సినీప్రియులకు ఊరట దక్కింది, తక్కువ ధరలోనే సినిమా చూసే అవకాశం చిక్కింది. అయితే పలు సినీ నిర్మాణ, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు దీనిపై న్యాయ పోరాటానికి దిగి తమ పంతాన్ని నెగ్గించుకున్నాయి. ఆ సంస్థలు పిటిషన్లు వేయడంతో, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మీద హైకోర్టు మంగళవారం స్టే ఇచ్చింది. దీంతో సినిమా టికెట్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు అయ్యింది. మల్టీప్లెక్స్ అసోసియేషన్, ఇతర సంస్థలు సమర్పించిన పిటిషన్ మేరకు న్యాయమూర్తి రవి వీ హొస్మని మధ్యంతర స్టే ని జారీచేశారు. పిటిషన్‌లను విచారణ జరిపి స్టే ఇస్తూ, ఇది తుది తీర్పు వరకే అమలులో ఉంటుందని పేర్కొన్నారు.
సర్కారు నిర్ణయంపై హైకోర్టుకు
పలు సంస్థలు
స్టే ఇచ్చిన న్యాయస్థానం
ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
అప్పటి నుంచి అయిష్టంగానే
కర్ణాటక సినిమాల నియంత్రణ సవరణ నియమాలు– 2025 కింద అన్ని రకాల సినిమా థియేటర్లలో టికెట్ ధర రూ.200 మించరాదని సర్కారు కొన్ని వారాల కిందట ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో థియేటర్ల యాజమాన్యాలు అయిష్టంగానే ధరలను తగ్గించి అమ్ముతున్నాయి. దీని వల్ల తమకు గిట్టుబాటు కావడం లేదని మాట్లాడుకుని హైకోర్టులో సవాల్ చేశాయి. ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షం, చట్ట వ్యతిరేకం, వివేచనారహితమైదని పేర్కొన్నాయి. ప్రభుత్వం 2017లో కూడా ఇదే మాదిరి ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను హైకోర్టు రద్దు చేసిన తరువాత ఉపసంహరించుకుందని పిటిషన్‌దారుల లాయర్లు వాదించారు. ప్రభుత్వ హఠాత్ చర్య చలనచిత్ర నిర్మాతలను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ప్రధాన సినిమాల విడుదలకు ముందుగా టికెట్ ధరల పెంపు కోరతారన్నారు.
సర్కారుకు వాణిజ్య మండలి అండ
అయితే కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి తరఫున న్యాయవాది సర్కారుకు మద్దతుగా వాదనలు వినిపించారు. ప్రభుత్వ తీర్మానానికి మద్దతుగా మండలి తరఫున మధ్యంతర పిటిషన్ సమర్పించారు, మండలి విన్నపం మేరకు సర్కారు టికెట్ ధరలను సవరించిందని పేర్కొన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా పొరుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్‌లలో ఒకే ధర విధానం అమలులో ఉందని, దానినే ఇక్కడ కూడా పాటించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు సిద్దరామయ్య సర్కారు ఏ నిర్ణయం తీసుకొంటుందనే కుతూహలం నెలకొంది.

రూ.200 మల్టీప్లెక్స్ టికెట్‌కు బ్రేక్

రూ.200 మల్టీప్లెక్స్ టికెట్‌కు బ్రేక్