
సముద్రంలో బెంగళూరు బాలుడు గల్లంతు
యశవంతపుర: దసరా సెలవులని కుటుంబంతో విహారయాత్రకు వెళ్లిన బాలుడు సముద్రం పాలయ్యాడు. కార్వార వద్ద మురుడేశ్వర బీచ్‌లో గల్లంతయ్యాడు. వివరాలు.. బెంగళూరు బిదరహళ్లికి చెందిన కృతిక్‌రెడ్డి (8)తో తల్లిదండ్రులు కె.రవిరెడ్డి, వసంత మురుడేశ్వరకు వెళ్లారు. సోమవారం ఉదయం దర్శనం తరువాత సముద్ర తీరంలో నీటిలోకి దిగారు. ఆటలాడుతుండగా ఒక్కసారిగా భారీ అల వచ్చి కృతిక్‌రెడ్డిని లాక్కొని వెళ్లింది. రక్షించడానికి తల్లి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. నీటిలో మునిగిపోతున్న తల్లిని అక్కడి లైఫ్ గార్డ్ కాపాడారు. కృతిక్ కోసం గాలింపు సాగుతోంది. అస్వస్థత పాలైన వసంతను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దుర్ఘటనతో కుటుంబీకుల విచారానికి అంతులేదు.
బావిలో పడ్డ చిరుత
దొడ్డబళ్లాపురం: ప్రమాదవశాత్తు బావిలో పడ్డ చిరుతను అటవీశాఖ సిబ్బంది రక్షించిన సంఘటన మాగడి తాలూకా హాలశెట్టిహళ్లి గ్రామంలో జరిగింది. ఆహారం వెతుక్కుంటూ గ్రామం వైపు వచ్చిన చిరుత రైతు రేవన్నకు చెందిన తోటలోని బావిలోకి పడిపోయింది. చిరుత అరుపులు విన్న రైతులు వచ్చి చూసి హడలిపోయారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు చేరుకుని చిరుతను బంధించి, బన్నేరుఘట్ట జూ పార్క్‌కు తరలించారు.
పులి దాడిలో వృద్ధుడు బలి
మైసూరు: పులి దాడిలో ఆదివాసి వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. జిల్లాలోని హెచ్.డి. కోటె తాలూకాలోని బండీపుర అభయారణ్యంలోని మాళదహాడిలో జరిగింది. హాడి గ్రామానికి చెందిన కెంచ (67) అనే గిరిజన వృద్ధుడు సోమవారం మధ్యాహ్నం పొలంలో పనిచేసుకుంటూ ఉన్నాడు. అడవిలోని నుంచి పులి వచ్చి అతనిని లాక్కునిపోయింది. రాత్రయినా భర్త ఇంటికి రాకపోవడంతో కెంచ భార్య మంగళవారం ఉదయాన్నే పొలానికి వచ్చి చూడగా కనిపించలేదు. అటవీ అధికారులకు ఫిర్యాదు చేయగావారు వచ్చి అడవిలో గాలించి, అతడు పులి దాడిలో చనిపోయినట్లు తెలిపారు. కెంచ మృతదేహాన్ని వెతికి భార్యకు అప్పగించారు. రూ.15 లక్షల పరిహారాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అనిల్ చిక్కమాదు అటవీ అధికారులతో, కుటుంబీకులతో చర్చించారు.
ఎడమ కాలికి బదులు కుడికాలికి ఆపరేషన్
యశవంతపుర: వైద్యుని నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణానికి వచ్చింది. ఎడమకాలుకు బదులుగా కుడికాలుకు శస్త్రచికిత్స చేసిన ఘటన హాసన్ జిల్లా ఆస్పత్రిలో జరిగింది. వివరాలు.. జ్యోతి అనే మహిళ చిక్కమగళూరు జిల్లా బూచనహళ్లివాసి. రెండున్నర ఏళ్లు క్రితం రోడ్డు ప్రమాదంలో జ్యోతి ఎడమకాలు గాయపడి నడవలేకుండా ఉంటే వైద్యులు ఆపరేషన్ చేసి రాడ్ వేశారు. ఇటీవల ఆమెకు ఆ కాలిలో నొప్పి వస్తోంది. దీంతో హాసన్ హిమ్స్ ఆస్పత్రిలో చేరగా డాక్టర్ సంతోష్ పరీక్షలు చేసి రాడ్‌ను తీసివేయాలని తెలిపారు. సోమవారం ఎడమకాలుకు బదులుగా కుడి కాలిని కోసి రాడ్ కోసం వెతికారు. తప్పు చేశానని గ్రహించి మళ్లీ ఎడమకాలికి ఆపరేషన్ చేసి రాడ్‌ను తొలగించారు. డా.సంతోష్ నిర్వాకంపై బాధితురాలి బంధువులు మండిపడ్డారు. ఏమాత్రం స్పృహ లేకుండా ఇష్టానుసారం రోగు లకు వైద్యం చేస్తారా? అని జనం ప్రశ్నించారు.
చెరుకు తోటలో గంజాయి పంట
దొడ్డబళ్లాపురం: చెరుకు పంట మధ్యలో గుట్టుగా గంజాయి సాగు చేస్తున్న రైతు బండారం బట్టబయలైంది. బెళగావి జిల్లా రాయభాగ తాలూకా నిడగుంది గ్రామం నివాసి సింగాడి మాళప్ప హిరేకోడి ఒక ఎకరా చెరుకు పంట మధ్యలో గుట్టుగా గంజాయిని పండిస్తున్నాడు. ఇది తెలుసుకున్న పోలీసులు దాడులు చేశారు. చెట్లను పీకి తూకం వేయగా 441 కేజీలుగా తేలింది. జిల్లా చరిత్రలోనే ఇంత పెద్ద ప్రమాణంలో గంజాయి దొరకడం ఇదే మొదటిసారి అని పోలీసులు తెలిపారు. దీని విలువ రూ.22 లక్షలుగా అంచనా వేశారు. ఇప్పటివరకు గంజాయిని ఎక్కడెక్కడికి సరఫరా చేశాడు, ఈ దందాలో ఎంతమంది ఉన్నారు అనేది విచారణ చేపట్టారు.

సముద్రంలో బెంగళూరు బాలుడు గల్లంతు

సముద్రంలో బెంగళూరు బాలుడు గల్లంతు