
దంపతుల నిర్లక్ష్యం.. ముగ్గురు శిశువుల మరణం
బొమ్మనహళ్లి: ఎంతోమంది దంపతులు పిల్లలు లేక బాధపడుతుంటే, మరికొందరు పుట్టిన శిశువులను కాపాడుకోలేకపోతున్నారు. నిర్లక్ష్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంతో గర్భిణి ఆస్పత్రికి వెళ్ళి సక్రమంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం, ఔషధాలను వాడకపోవడం ముగ్గురి ప్రాణాలను తీసింది. ఆ గర్భిణికి ఏకంగా ముగ్గురు శిశువులు జన్మించగా, అనారోగ్యంతో పురిట్లోనే చనిపోయిన సంఘటన బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలోని బన్నేరుఘట్ట వద్దనున్న గొళ్ళహళ్లిలో జరిగింది.
ఆస్పత్రికి వెళ్లలేదు, మందులు వాడలేదు
వివరాలు.. మంజుళ, ఆనంద్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమించుకొని ఇంటి నుంచి పారిపోయి పెళ్ళి చేసుకున్నారు. తరువాత తమ బంధువుల ఇంట్లో సంసారం పెట్టారు. అక్కడ గొడవ పడి మరో బాడుగ ఇంటికి మారారు. ఆనంద్ గార పనిచేసేవాడు. మంజుళ ఏప్రిల్‌లో గర్భం దాల్చింది, ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి తల్లి కార్డును తీసుకుంది. అయితే తరచుగా ఆస్పత్రికి వెళ్లడం, స్కానింగ్ చేయించుకోవడం మానేసింది. గర్భిణులు తీసుకోవాల్సిన పోషకాహారం, ఔషధాలను కూడా వాడడం లేదు. రెండురోజుల కిందట ఆమెకు పుకిటినొప్పులు రాగా స్థానికంగా ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు వైద్యులు సిజేరియన్ చేయగా ముగ్గురు పిల్లలు జన్మించారు. పుట్టిన కొన్ని నిమిషాల్లోనే వారు ఊపిరి వదిలారు. తల్లికి చికిత్స కోసం ఆనేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. ఒక్కసారి కూడా ఆస్పత్రికి వెళ్లకపోవడం, మందులు వాడకపోవడం వల్ల శిశువులు బలహీనంగా పుట్టారని వైద్యులు తెలిపారు.
ఒకే కాన్పులో ప్రసవం,
కొంతసేపటికే మృతి
బెంగళూరు వద్ద విషాదం

దంపతుల నిర్లక్ష్యం.. ముగ్గురు శిశువుల మరణం