
శత రుద్ర హోమం
బనశంకరి: సిలికాన్ సిటీలో బనశంకరీదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంగళవారం అమ్మవారిని శ్రీ బ్రహ్మచారిణి రూపంలో అలంకరించారు. పురోహితులు యాగశాలలో శతరుద్రాభిషేక రుద్రహోమం చేపట్టి మధ్యాహ్నం 1 గంటకు పూర్ణాహుతి గావించారు. పరమశివుని రూపాన్ని రంగవల్లిగా తీర్చిదిద్దారు. పెద్దఎత్తున భక్తులు విచ్చేసి దర్శనం చేసుకున్నారు.
చాముండి ఆలయంలో సంప్రోక్షణ
మైసూరు: నాడ హబ్బ వేళ విషాద ఘటన జరిగింది. చాముండికొండపైన సోమవారం ఘనంగా చాముండేశ్వరి అమ్మవారి సన్నిధిలో దసరా వేడుకలు ప్రారంభం కావడం తెలిసిందే. అయితే ఆలయ అర్చకుల్లో ఒకరైన వి.రాజు (51) రాత్రి గుండెపోటుతో మరణించారు. దాంతో మంగళవారం ఆలయ దర్శనానికి భక్తులను అనుమతించలేదు. మధ్యాహ్నం నుంచి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి అర్చకులు మాత్రమే పూజలు నిర్వహించారు.