
అతిథి ఉపన్యాసకులను నియమించండి
బళ్లారిఅర్బన్: అతిథి ఉపన్యాసకుల(గెస్ట్ లెక్చరర్ల) నియామకాలను వెంటనే చేపట్టాలని సదరు సంఘం రాష్ట్ర గౌరవ జిల్లాధ్యక్షుడు టి.దుర్గప్ప తెలిపారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 432 ప్రభుత్వ ప్రథమ గ్రేడ్ కళాశాలలు ఉండగా వీటిలో శాశ్వత లెక్చరర్లు 3000, గెస్ట్ లెక్చరర్లు సుమారు 10,500 మంది ఉన్నారన్నారు. వీరిలో యూజీసీ అర్హత పొందిన వారు 5000, అలాగే అర్హత లేని వారు 6000 మంది అన్నారు. రాష్ట్రంలో యూజీసీ, అన్ యూజీసీ అంటూ విభజించు పాలించు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కళాశాల విద్యా శాఖ అనుసరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జాప్య విధానానికి, నిర్లక్ష్య ధోరణి వల్ల అతిథి ఉపన్యాసకులు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ కుటుంబ సభ్యులకు న్యాయం చేయలేక పోతున్నారన్నారు.
రెండు నెలలుగా అందని గౌరవధనం
రెండు నెలలుగా అతిథి ఉపన్యాసకులకు గౌరవధనం చెల్లించలేదని ఆయన వాపోయారు. ఇంటి అద్దె పిల్లల స్కూల్ ఫీజులు, కిరాణా సరుకులు, వృద్ధులైన తల్లిదండ్రులకు తగిన చికిత్సలు చేయించలేక పోవడంతో పాటు ఔషధాలను కూడా సమకూర్చలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సరళాదేవి కళాశాలలో బైపాస్ హార్ట్ సర్జరీ చేయించుకున్న సీనియర్ అతిథి ఉపన్యాసకులు డాక్టర్ కే.బసప్పకు నెలకు ఔషధాల ఖర్చు సుమారు రూ.8 వేలు అవుతోందన్నారు. బసప్పలానే ఎంతో మంది లెక్చరర్లు తీరని అనారోగ్య, ఆర్థిక బాధలతో పడరాని పాట్లు పడుతూ తమ కుటుంబాలను భారంగా నెట్టుకొస్తున్నారని ఆయన తమ తోటి లెక్చరర్ల జీవిత చేదు అనుభవాలను సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ హనుమేశ, డాక్టర్ కే.బసప్ప, డాక్టర్ నాగప్ప తదితరులు పాల్గొన్నారు.