
ఆయుర్వేద చికిత్సతో ఉత్తమ ఫలితాలు
హొసపేటె: శారీరక, మానసిక సమస్యలు లేకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి ఆయుర్వేద మూలికలు, మందులు ఉత్తమమైనవని ఆయుష్ శాఖ వైద్యాధికారి డాక్టర్ మునివాసుదేవ రెడ్డి తెలిపారు. శనివారం నగరంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా ఆయుష్ విభాగం, ఆయుష్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా యూనిట్, పతంజలి యోగా ఇనిస్టిట్యూట్, టీఎంఏఈ నర్సింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఆయుర్వేద నడక జాతా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురాతన చికిత్సకు చాలా ప్రముఖ్యత ఉందని తెలిపారు. ఆయుర్వేదం లక్షణాలను అణిచివేయడమే కాకుండా, సమస్య మూల కారణాన్ని గుర్తించి చికిత్స చేయడానికి తగిన వైద్య పద్ధతి ఆయుర్వేదం అని వెల్లడించారు. ఆయుర్వేదంలో శరీరంలోని అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం ఉందన్నారు. వ్యక్తి శరీర స్వభావం (దోషాలు) భిన్నంగా ఉంటుంది. ఆయుర్వేదం వ్యక్తి స్వభావాన్ని బట్టి ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని అందించగలదన్నారు. కార్యక్రమంలో వైద్యులు గురుబసవ రాజ్, బీవీ భట్ కేదార్ దండిన్, రూప్ సింగ్ పాల్గొన్నారు.