
‘జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిని దూషించడం తగదు’
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్‌ను మాజీ నగర సభ అధ్యక్షుడు సుఖాణి దూషించడం తగదని కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన వర్గాల ఉపాధ్యక్షుడు టి.మారెప్ప హితవు పలికారు. ఇటీవల జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్‌ను పొగడి.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్‌ను దూషించి మెప్పు పొందడం తగదన్నారు. జిల్లాకు అన్ని ఆరోగ్య సౌలభ్యాలు కల్పించిన మంత్రిని దూషించారని మండిపడ్డారు.
మంటలకు దుస్తుల
దుకాణం ఆహుతి
కోలారు: అగ్ని ప్రమాదంలో బట్టల దుకాణం ఆహుతైన ఘటన నగరంలో చోటు చేసుకుంది. ఎంజీ రోడ్డులో ఓ వ్యక్తి బట్టల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉన్నఫళంగా మంటలు చెలరేగడంతో సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అనంతరం మంటలు ఎగసి పడి భారీ ఎత్తున వస్త్రాలు, ఇతర ఫర్నీచర్, కంప్యూటర్ యూపీసీఎస్ తదితర సామగ్రి కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. రూ.25 లక్షల నష్టం జరిగినట్లు యజమాని చెబుతున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు.