
చదువుల తల్లికి మణిహారం
బళ్లారి రూరల్: బళ్లారి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (బీఐటీఎం) కళాశాలకు చెందిన బీఈ(ఈఈఈ) విభాగానికి చెందిన విద్యార్థిని ఆలియా సమా రాష్ట్రంలోనే అత్యధికంగా 73 క్రెడిట్లు సాధించి, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధించినట్లు ఆ కళాశాల కార్యదర్శి, ట్రస్ట్ సభ్యుడు వై.జె.పృథ్వీరాజ్ భూపాల్ తెలిపారు. శనివారం నగరంలోని కిష్కింధ విశ్వవిద్యాలయ కార్యదర్శి చాంబర్‌లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2024–25వ విద్యా సంవత్సరంలో బీఈ(ఈఈఈ) హానర్స్ డిగ్రీలో ఆలియా సమా అత్యధికంగా 73క్రెడిట్‌లను సాధించి రాష్ట్రంలోనే ప్రథమంగా నిలిచింది. ఈ ఆరుదైన ఘనతకు గాను ఇండియా బుక్ ఆఫ్ రెకార్డ్స్ లో చోటు దక్కినట్లు తెలిపారు. బీఈ హానర్స్ డిగ్రీలో 160 క్రెడిట్‌లు ఉంటాయి. ఇందులో 18 క్రెడిట్‌లను సాధించాల్సి ఉంటుంది.
ఏకంగా 73 క్రెడిట్లతో రికార్డు
కాని కుమారి ఆలియా సమా ఏకంగా 73 క్రెడిట్‌లను సాధించి, అప్పటివరకు రాష్ట్రంలో ఉన్న 39 క్రెడిట్ల రికార్డ్‌ను బద్దలు కొట్టి ఇండియా బుక్‌ఆఫ్స్ రికార్డ్స్‌ను సాధించిందని తెలిపారు. అంతేకాకుండా ఈఈఈలో మొదటిర్యాంకు సాధించి ఆ బ్యాచ్‌కు టాపర్‌గా నిలిచినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆలియా సమా జర్మనీలోని సీమన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు. కళాశాలకు చెందిన 18 మందిలో 11 మంది హానర్స్ డిగ్రీ సాధించినట్లు తెలిపారు. ఈ ఏడాది 581 మంది విద్యార్థులు డిగ్రీలు సాధించి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొంది రూ.40 లక్షల ప్యాకేజీని తీసుకొంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలియా సమాను సన్మానించి పతకాన్ని, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ అందజేశారు. కళాశాల ప్రిన్స్‌పాల్ యడవళ్లి బసవరాజ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ హెచ్‌ఓడీ శరణరెడ్డి, ఆలియా తండ్రి షకీబ్ పాల్గొన్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆలియా సమా
రాష్ట్రంలోనే అత్యధికంగా
73 క్రెడిట్‌ల సాధన
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించిన వైనం