
బెంగళూరు వర్సిటీలో కీచకపర్వం
శివాజీనగర: చదువుల తల్లి నిలయమైన బెంగళూరు విశ్వవిద్యాలయంలో కొందరు ప్రొఫెసర్లు కీచకులుగా మారినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. ఓ అతిథి అధ్యాపకురాలు (గెస్ట్ లెక్చరర్)ని వేధించినట్లు ఆమె జ్ఞానభారతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో స్వరూపకుమార్, రామాంజినేయులతో పాటుగా ఐదుమంది ప్రొఫెసర్ల మీద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇదే సమయంలో సదరు నిందితుల పలు వీడియోలు వైరల్ అయ్యాయి. విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి బదులుగా మద్యం సేవించి మత్తులై ఇష్టానుసారంగా ప్రవర్తించారు. కై పులో చిందులు వేశారు. ఇక రామాంజనేయులు అయితే బట్టలు విప్పి విశ్వవిద్యాలయ ఆవరణంలో డ్యాన్స్ చేశాడు. ఇతని మీద వరుసగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ అంధ విద్యార్థినికి పరీక్షల్లో మార్కులు వేయాలంటే డబ్బు డిమాండ్ పెట్టాడని సమాచారం.
ఓ జయంతి వేడుకలో మద్యం తాగి మరో అమ్మాయిని ఎత్తుకుని నృత్యాలు చేశాడని సమాచారం. ఆ వీడియో సైతం వైరల్ అయింది. సమాజం పట్ల బాధ్యతగా ప్రవర్తించాల్సిన అధ్యాపకులు, ప్రొఫెసర్లు నిర్లజ్జగా నడుచుకున్న సంఘటనలపై ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఓసారి జ్ఞానభారతి ఆవరణంలో ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. చోరీ, పోట్లాటల కేసులు కూడా ఇక్కడ జరిగాయి.
ప్రొఫెసర్లపై గెస్ట్ లెక్చరర్ ఫిర్యాదు

బెంగళూరు వర్సిటీలో కీచకపర్వం