
భద్రావతిలో చెడ్డీ గ్యాంగ్ సంచారం
శివమొగ్గ: ఇటీవల శివమొగ్గలోని విద్యానగర పరిసర ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ దోపిడీ దొంగలు సంచరించారు. ఇంతలోనే భద్రావతి నగరంలోని సిద్దారూడనగర చుట్టుపక్కల ప్రాంతాల్లో రెక్కీలు జరిపారు. ఈ నెల 19న అర్ధరాత్రి 1 నుంచి 3 గంటల మధ్య ఈ దొంగలు ముఖానికి మంకీ క్యాప్‌లు, బట్టలు చుట్టుకుని, రాడ్లు, కత్తులు పట్టుకుని పలు ఇళ్ల ఆవరణలో కలియతిరిగారు. ఆరేడు మంది దొంగలు ఉన్నారు. సదరు దృశ్యాలు ఇళ్ల సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
లైట్లు వేయగానే పరార్
డాక్టర్ అశ్వత్థ నారాయణ అనే వ్యక్తి ఇంటి కాంపౌండ్‌ను దూకి చొరబడిన దుండగులు దోచుకోవడానికి వీలవుతుందా అని తనిఖీ చేశారు. ఇంటివారు మేల్కొని లైట్లు వేశారు. దీంతో దొంగలు జారుకున్నారు. ఇదే సమయంలో సదరు బడావణెలో పాత టౌన్ బీట్ పోలీసు సిబ్బంది జైనుల్లా, మంజునాథ్‌లు బైక్‌లో అక్కడకు వచ్చారు. వారిని చూసిన దొంగలు భద్రా నది గుండా తప్పించుకుని పరారయ్యారు. ఎస్‌ఐ సునీల్, ఏఎస్‌ఐ కుబేరప్ప తమ సిబ్బందితో స్థలానికి చేరుకుని దుండగుల ఆచూకీ కోసం గాలించినా జాడ లేదు. నగరంలో గస్తీని పెంచినట్లు తెలిపారు. చీకటి పడగానే దొంగల భయం ఏర్పడుతోంది.
ఇళ్లలో రెక్కీలు, పోలీసుల గాలింపు