
రాజధానిలో 5వేల రోడ్ల గుంతలు పెండింగ్: డీసీఎం
శివాజీనగర: బెంగళూరులో 7 వేలకు పైగా రోడ్డు గుంతలను ఇప్పటికే మూసివేయించాం, మరో 5 వేల వరకు గుంతలు పెండింగ్‌లో ఉన్నాయి, ఎందుకు అనేది పోలీస్ కమిషనర్ ద్వారా నివేదిక కోరాం, ప్రజలు ఎక్కడైనా రోడ్డు గుంతలు కనిపిస్తే నా దృష్టికి తీసుకురావచ్చు అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. శనివారం సదాశివనగర నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు.గుంతల రోడ్ల సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని, యుద్ధప్రాతిపదికన పని జరుగుతోంది, రాజకీయం చేసేవారు చేయనీ అన్నారు. అధిక వర్షాల వల్ల గుంతల సమస్య వచ్చిందన్నారు. ప్రతి బీజేపీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి రూ.25 కోట్లు నిధులు ఇచ్చాం, వారు ఆ నిధులతో ఎందుకు రోడ్డు గుంతలను బాగుచేయలేదు, ధర్నాలు ఎందుకు చేస్తున్నారు అని మండిపడ్డారు.