
వ్యక్తి ద్వేషానికి యువతి బలి
దొడ్డబళ్లాపురం: వ్యక్తిపై ద్వేషంతో అతని కుమార్తెను హతమార్చిన కిరాతకుడి ఉదంతం కలబుర్గి జిల్లా సేడం తాలూకా మళఖేడ గ్రామంలో చోటు చేసుకుంది. ఇదే గ్రామ నివాసి భాగ్యశ్రీ హత్యకు గురైన యువతి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఈనెల 11న భాగ్యశ్రీ రోజులానే రాత్రి 8 గంటల సమయంలో తన అక్కతో కలిసి బయటకు వాకింగ్‌కు వచ్చింది. ఆ సమయంలో ఆమె అక్క కాస్త దూరంలోని కిరాణా కొట్టుకు వెళ్లి అవసరమైన వస్తువులు తీసుకుని వచ్చేలోపు భాగ్యశ్రీ కనబడకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చారు. అయితే శుక్రవారం ఉదయం భాగ్యశ్రీ మృతదేహం గ్రామ శివారులోని సిమెంటు ఫ్యాక్టరీ పక్కన నాలాలో లభించింది. మృతదేహం దాదాపు కుళ్లిపోయింది. నెల రోజుల క్రితం సిమెంటు ఫ్యాక్టరీలో పని చేస్తున్న వినోద్ అనే వ్యక్తి తన ఉద్యోగం పర్మినెంటు కాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకు కారణం ఫ్యాక్టరీలో యూనియన్ లీడర్‌గా ఉన్న భాగ్యశ్రీ తండ్రి చెన్నబసయ్య అని నమ్మిన వినోద్ తమ్ముడు మంజునాథ్ వినోద్ మృతికి చెన్నబసయ్య కారణమని భావించి అతడిపై కక్ష పెంచుకున్నాడు. ప్రతీకారంగా అతడి కుటుంబ సభ్యుల్లో ఒకరిని హత్య చేస్తానని గ్రామస్తులందరి ముందు ప్రతిన బూనాడు. అన్నట్టుగానే భాగ్యశ్రీని కిడ్నాప్ చేసి హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది. మిస్సింగ్ కేసు నమోదవగానే మంజునాథ్‌పై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహం లభించడంతో పోలీసులు మంజునాథ్‌ను అరెస్టు చేశారు. మరో నెల రోజుల తర్వాత భాగ్యశ్రీ ఇంజినీరింగ్ కళాశాలలో చేరాల్సి ఉంది. అయితే దుండగుడి ప్రతీకారానికి బలైంది.
కిడ్నాప్ చేసి హత్య చేసిన కిరాతకుడు