బస్సులోనే ఆగిన డ్రైవర్‌ గుండె | - | Sakshi
Sakshi News home page

బస్సులోనే ఆగిన డ్రైవర్‌ గుండె

Sep 17 2025 7:39 AM | Updated on Sep 17 2025 7:39 AM

బస్సు

బస్సులోనే ఆగిన డ్రైవర్‌ గుండె

దొడ్డబళ్లాపురం: విధుల్లో ఉండగా కేఎస్‌ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు రాగా బస్సును పక్కకు నిలిపి ప్రయాణికులను రక్షించి ప్రాణం వదిలిన సంఘటన బెంగళూరు వద్ద నెలమంగల టోల్‌ దగ్గర జరిగింది. ఉత్తర కర్ణాటకకు చెందిన రాజీవ్‌ బిరాదార డ్రైవర్‌. బస్సు బెంగళూరు మెజెస్టిక్‌ నుంచి దావణగెరె జిల్లా హరిహరకు వెళ్తుండగా ఘటనాస్థలి వద్దకు రాగానే రాజీవ్‌కి గుండెనొప్పి వచ్చింది. ప్రమాదాన్ని గ్రహించిన ఆయన వెంటనే బస్సును రోడ్డుపక్కకు నిలిపివేసి స్పృహ తప్పారు. ప్రయాణికులు 108 అంబులెన్స్‌కి కాల్‌ చేశారు. అంబులెన్స్‌లో రాజీవ్‌ని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మరణించారు. నెలమంగల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

రామనగరకూ సిటీ

బస్సులు: మంత్రి

దొడ్డబళ్లాపురం: ఇకపై రామనగరకూ బీఎంటీసీ బస్సు సేవలను విస్తరిస్తున్నట్టు రవాణా మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. రామనగరలోని బస్టాండులో కేఎస్‌ఆర్‌టీసీ ఆధ్వర్యంలో లోకల్‌ బస్సుల సంచారాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ తగిన స్థలం ఇస్తే రామనగరలో కొత్త బస్టాండును నిర్మిస్తామన్నారు. రామనగర నుంచి బెంగళూరు, చుట్టుపక్కల ఊర్లకు బీఎంటీసీ బస్సులను నడుపుతామని తెలిపారు. ఆర్టీసీ కొత్తగా 5,800 బస్సులను ఖరీదు చేసిందన్నారు. డ్రైవర్‌లు, కండక్టర్లు, మెకానిక్‌లు తదితర సిబ్బంది కలిపి మొత్తం 10వేల మందిని కొత్తగా నియమించుకున్నామన్నారు. దీంతో మరిన్ని ఎక్కువ సంఖ్యలో బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయన్నారు. రోజూ 60– 65 లక్షల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇటీవల రామనగరను బెంగళూరు దక్షిణగా మార్చడం తెలిసిందే.

15 ఏళ్లు దాటిన సర్కారీ వాహనాలు తుక్కే

శివాజీనగర: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖ, బోర్డు, కార్పొరేషన్‌, నగరసభ, ప్రభుత్వ ఇతర అనుబంధ సంస్థలకు చెందిన 15 సంవత్సరాలు పైబడిన కార్లు, లారీలు వంటి వాహనాలను తప్పకుండా స్క్రాప్‌ (తుక్కు) గా చేయాలని ప్రభుత్వం అతి ప్రాముఖ్యమైన ఆదేశాలిచ్చింది. కేంద్ర ప్రభుత్వ మోటారు వాహనాల చట్టం ప్రకారం రాష్ట్రంలో రిజిస్టరై 15 ఏళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర శాఖలకు చెందిన వాహనాలను వెంటనే ఉపయోగం నుంచి తొలగించాలి, వాటిని తుక్కుగా మార్చేయాలని సర్కారు ప్రకటించింది. ఇప్పటికి 5 వేల వాహనాలు ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర నిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన బైక్‌లు, కార్లు వంటి అన్ని రకాల వాహనాలను తుక్కు కింద విక్రయించాలి. కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ చర్యలను చేపట్టింది.

లండన్‌ టు నందిహిల్స్‌.. పూర్వీకుల సమాధికి నివాళి

చిక్కబళ్లాపురం: బ్రిటిష్‌ కాలంలో ఎంతో మంది తెల్లదొరలు, వారి కుటుంబసభ్యులు ఇక్కడ పనిచేస్తూ చనిపోగా, స్థానికంగానే సమాధి చేశారు. ప్రతి ఊళ్లోను అలాంటి సమాధులు కనిపిస్తాయి. విఖ్యాత నందిహిల్స్‌లో తమ సమీప బంధువైన సోఫియా గ్యారెట్‌ అనే ఆంగ్ల మహిళ సమాధిని అన్వేషిస్తున్న బ్రిటిష్‌ పౌరుడు ఎట్టకేలకు విజయం సాధించాడు. వివరాలు.. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో మైసూరు రాష్ట్రంలో విద్యాశాఖలో జాన్‌ గ్యారెట్‌ అనే అధికారి పనిచేసేవాడు. ఆయన కవి, ముద్రణాకారుడు కూడా. ఆ అధికారి భార్య అయిన సోఫియా ఇక్కడే కాలం చేయడంతో సమాధి చేశారు. మంగళవారం లండన్‌లో నివసించే వారి దగ్గరి బంధువు ఒకరు నంది హిల్స్‌ వద్ద ఉన్న సమాధిని చేరుకుని కన్నీటితో ప్రార్థనలు చేశారు. పర్యాటక గైడ్‌ నళిని మాట్లాడుతు ఇప్పటికి రెండు మూడు సార్లు వీరు నందికొండకు వచ్చారు, సోఫియా గ్యారెట్‌ సమాధిని వెతికారు, అయితే ఆచూకీ దొరకలేదు, అన్ని దాఖలాలను చూపించారు, ఈ దఫా సోఫియా సమాధిని కనుగొన్నారు అని తెలిపారు. సమాధిని చూసి కన్నీళ్లు పెట్టుకొన్న ఆ పౌరుడు, తరువాత కొంతసేపు శ్రద్ధాంజలి ఘటించి వెళ్లిపోయారు.

బస్సులోనే ఆగిన డ్రైవర్‌ గుండె 1
1/1

బస్సులోనే ఆగిన డ్రైవర్‌ గుండె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement