
ఆ ముఖ్యమంత్రుల అడ్డుపుల్ల: డీసీఎం శివకుమార్
బనశంకరి: కళ్యాణ కర్ణాటక కు ప్రత్యేక సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీర్మానించింది. మంగళవారం సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన విధానసౌధలో మంత్రిమండలి సమావేశం జరిగింది. ఇందులో ఆల్మట్టి ఎత్తు పెంపు, అప్పర్ కృష్ణా పనులు, రైతులకు పరిహారం మీద ముఖ్య నిర్ణయాలను తీసుకున్నారు. భేటీ అనంతరం న్యాయశాఖమంత్రి హెచ్‌కే.పాటిల్ మీడియా సమావేశంలో వివరాలను తెలిపారు. బీదర్, కలబుర్గి, రాయచూరు, బళ్లారి, విజయనగర, యాదగిరితో పాటు 7 జిల్లాలకు ప్రత్యేక సచివాలయం ఏర్పాటుకు ఆమోదించారు. రూ.70 వేల కోట్ల ఖర్చయ్యే అప్పర్ కృష్ణ (యుకేపీ) పథకం మూడోదశ పనులకు అవసరమైన భూమి సేకరణకు పరిహారం నిర్ణయించారు. భూస్వాధీనం కింద తీసుకునే నీరావరి భూమికి ఎకరా కు రూ.40 లక్షలు, బీడు (మెట్ట) భూమికి ఎకరా కు రూ.30 లక్షల ధరను చెల్లిస్తారు.
ఆల్మట్టి ఎత్తు పెంపు పథకం
కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం కృష్ణా నదిపైనున్న ఆల్మట్టి జలాశయం ఎత్తును 519.6 మీటర్లు నుంచి 524.256 మీటర్లు కు పెంచుతారు. దీనివల్ల డ్యాం వెనుక ఉండే హిన్నేరి నుంచి సుమారు 75,000 ఎకరాలకు పైగా భూములు మునిగిపోయే అవకాశం ఉంది. అయితే ఎత్తు పెంపు వల్ల సుమారు 14 నుంచి 15 లక్షల ఎకరాలకు నీటి వసతి లభిస్తుంది. తద్వారా రైతుల జీవన ప్రమాణం పెరుగుతుందని మంత్రి తెలిపారు.
కాలువలకు 51వేల ఎకరాలు
● ఆల్మట్టి డ్యాం నుంచి కాలువల నిర్మాణానికి సుమారు 51,837 ఎకరాలు అవసరం, కాగా ఇందులో 23,631 ఎకరాల భూమి స్వాధీన ప్రక్రియ సాగుతోంది.
● కాలువల కోసం సేకరించే భూమికి మెట్ట (బీడు) అయితే ఎకరాకు రూ.25 లక్షలు, మాగాణి అయితే ఎకరాకు రూ.30 లక్షలు పరిహారం అందించాలని తీర్మానించారు. భూమిని తీసుకున్న మూడు సంవత్సరాల్లోగా పరిహారం అందిస్తారు.
● అప్పర్ కృష్ణ మూడోదశ ప్రాజెక్టు వల్ల 75,563 ఎకరాల భూమి మునిగిపోతుంది. రైతుల పునరావాస కార్యక్రమాలకు 6,469 ఎకరాల అవసరం ఉంది. 20 గ్రామాలు, కొన్ని పట్టణాలలోని వార్డులు మునిగిపోతాయి.
● మొత్తం 1,33,867 ఎకరాలకు పరిహారం అందించాలి. ప్రతి ఏడాది సుమారు రూ.15 వేల నుంచి 20 వేల కోట్ల వ్యయం అవుతుంది, మొత్తం మీద అప్పర్ కృష్ణాకి సుమారు రూ.70 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు మంత్రి చెప్పారు.
విజయపుర జిల్లాలో కృష్ణా ప్రవాహం
ఆల్మట్టి డ్యాం ఎత్తును 524 మీటర్లకు
పెంచుతాం
75 వేల ఎకరాలకు పరిహారం
చెల్లించాలి
మాగాణికి ఎకరాకు రూ.40 లక్షలు, మెట్టకు రూ.30 లక్షలు
మంత్రివర్గ సమావేశంలో
ప్రాధాన్య నిర్ణయాలు
7 ఉత్తర కర్ణాటక జిల్లాలకు
ప్రత్యేక సచివాలయం
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ భూ స్వాధీనం గురించి స్థానిక నేతలు, రైతులతో చర్చించాం, తగిన పరిహారం, పునరావాసం కల్పిస్తామని చెప్పారు. ఇందుకు భూస్వాధీన పునశ్చేతన పరిహార ప్రాధికారను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో జడ్జిలు సభ్యులుగా ఉంటారన్నారు. కర్ణాటక రాష్ట్రం తన వాటా నీటికోసం నేను, సీఎం సిద్దరామయ్య పలుమార్లు కేంద్రజలవనరులశాఖ మంత్రిని కలిసి మాట్లాడాము, ఆదేశాల జారీకి ఆయన సమ్మతించారు, మరోసారి భేటీ అవుదామనుకుంటే, మహారాష్ట్ర సీఎం, మరోసారి ఆంధ్రప్రదేశ్ సీఎం ఒత్తిడితో వాయిదా పడ్డాయని డీకే తెలిపారు. భయపడాల్సిన పని లేదు, త్వరలోనే తేదీని నిర్ణయిస్తామని కేంద్రమంత్రి లేఖ రాశారని తెలిపారు.