
సవతి తల్లి మారణకాండ
దొడ్డబళ్లాపురం: ఆస్తి మీద కన్ను, అసూయతో సవతి కుమార్తెను మేడ మీద నుండి తోసి హత్య చేసిన దారుణ సంఘటన బీదర్ పట్టణంలోని ఆదర్శ కాలనీలో చోటుచేసుకుంది. సాన్వి (7) ని సవతి తల్లి రాధ (25) హత్య చేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రెండు వారాల తరువాత వెలుగులోకి
వివరాలు.. సిద్ధాంతకు ఓ యువతితో పెళ్లయింది, వీరికి బాలిక సాన్వి జన్మించింది. ఆరేళ్ల క్రితం బాలిక తల్లి అనారోగ్యంతో చనిపోయింది. 2023లో సిద్ధాంత రాధను రెండో పెళ్లి చేసుకోగా వీరికి కవల పిల్లలు జన్మించారు. తన పిల్లలకు ఆస్తిలో తక్కువ వాటా వస్తుందని, కాబట్టి సాన్వి ని అడ్డు తొలగించుకోవాలని రాధ కుట్ర చేసింది. ఆగస్టు 27న సాన్వి ని మేడ మీదకు తీసుకెళ్లి ఆడిస్తున్నట్టు నాటకమాడుతూ 3వ అంతస్తు నుండి తోసేసింది. బాలిక కిందపడడంతో తీవ్ర గాయాలై అక్కడే చనిపోయింది. ఇది ప్రమాదమని అందరూ అనుకున్నారు. ఈ నెల 12న సిద్ధాంతకు పక్కింటి వాళ్లు ఒక వీడియో పంపించారు. అందులో రాధ సాన్విని మేడమీద నుండి తోసేయడం స్పష్టంగా కనిపించింది. ఫిర్యాదు మేరకు పోలీసులు రాధను అరెస్టు చేసి విచారించగా ఆస్తి కోసమే, అలాగే తన పిల్లలకు అడ్డుగా ఉంటుందని హతమార్చినట్లు ఒప్పుకుంది.
మేడ మీద నుంచి
తోసి మారు కూతురి హత్య