
మంత్రి గుండూరావుకు లోకాయుక్త పిలుపు
శివాజీనగర: గృహ నిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్ అక్రమ ఆస్తి సంపాదన కేసులో సంచలనాలు నమోదవుతున్నాయి. ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావుకు లోకాయుక్త పోలీసులు నోటీస్ ఇచ్చారు. మంత్రి జమీర్‌తో ఆయన గత ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు గుర్తించి విచారణకు రావాలని తాఖీదులివ్వడం అధికార పార్టీలో కలకలం కలిగిస్తోంది. ఆర్థిక లావాదేవీల ఆధారాలతో విచారణకు హాజరుకావాలన్నారు. అయితే కొంత గడువు కావాలని మంత్రి కోరారు. ఇదే కేసులో ఇటీవల కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి సతీమణి, నటి రాధికా కుమారస్వామిని లోకాయుక్త అధికారులు విచారించారు.
ఏమిటీ కేసు..
2019లో బెంగళూరు శివాజీనగరలో ఐ మానిటరి అడ్వైజరీ అనే ఆర్థిక సంస్థ వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించి బోర్డు తిప్పేయడం తెలిసిందే. ఆ కేసులో జమీర్ అహ్మద్ ఇంటిలో ఈడీ సోదాలు చేసింది. ఆ సమాచారం ప్రకారం లోకాయుక్త అక్రమాస్తుల కేసును నమోదు చేసింది. అప్పటినుంచి విచారణ జరుపుతున్నారు. తాను ఎవరెవరి నుంచి అప్పులు తీసుకొన్నాననేది జమీర్ లోకాయుక్త పోలీసులకు రాతపూర్వకంగా జాబితానిచ్చారు. ఈ జాబితాలో ఉన్నవారిని లోకాయుక్త విచారణకు పిలుస్తోంది.
మంత్రి జమీర్‌తో
ఆర్థిక లావాదేవీలపై నోటీసు