
మెడికల్ సీట్ల కోసం.. నకిలీ వైకల్యం
శివాజీనగర: దివ్యాంగులమంటూ నకిలీ వైకల్య స ర్టిఫికెట్లు చూపి వైద్య విద్యా సీట్లు పొందాలని 21 మంది విద్యార్థులు మోసానికి పాల్పడ్డారు. బధిరత్వం లేకపోయినా తాము చెవిటివారు అని చెప్పుకొని నకిలీ ధృవపత్రాలను సమర్పించారు. వారి మీద కర్ణాటక పరీక్షా ప్రాధికార పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఏడాది యూజీ, నీట్ సీట్ల కోసం 21 మంది అభ్యర్థులు దివ్యాంగుల కోటా క్రింద దరఖాస్తు చేసుకొన్నారు. మొదట్లో ఊరికే ఉండి, కౌన్సెలింగ్ ముగిసే సమయంలో పీహెచ్ రిజర్వేషన్ కింద సీటు ఇవ్వాలని హడావుడి చేశారు. దీంతో ప్రాధికార అధికారులకు అనుమానం వచ్చింది. ఆ 21 మందిని విక్టోరియా ఆసుపత్రికి వైద్య పరీక్షలకు తరలించారు. తరువాత అత్యాధునిక తనిఖీల కోసం నిమ్హాన్స్ ఆసుపత్రికి పంపించారు. వారెవరికీ బధిరత్వం లేదని, చక్కగా వినికిడి శక్తి ఉందని నిపుణులు నిర్ధారించారు. దీంతో నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారని ప్రాధికార నిర్ధారించుకుని మల్లేశ్వరం పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసింది.
హొసపేటలో మూలాలు
ఈ అభ్యర్థులు నకిలీ సీళ్లు, సంతకాల ద్వారా ఈ దందాకు పాల్పడ్డారు. వారికి విజయనగర జిల్లా హొసపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కొందరు సహకరించారని వెల్లడైంది. ర్యాంకు కార్డులు, ఇతరత్రా సర్టిఫికెట్లలోను లోపాలు బయటపడ్డాయి. దీంతో మూల ఆధారాలతో హాజరుకావాలని అందరికీ నోటీసులు ఇచ్చి తనిఖీలు చేయగా అక్రమాలు నిజమేనని తేలింది. మరో ఐదుగురు నిందితులను గుర్తించారు. మల్లేశ్వరం పోలీసులు తనిఖీని వేగవంతం చేశారు.
21 మంది అభ్యర్థులపై కేసు