
గుండెపోటుతో జవాన్ కన్నుమూత
కోలారు: రాష్ట్రంలో కొన్నిరోజులుగా ఆకస్మిక గుండెపోటు మరణాలు తగ్గాయి, కానీ అంతలోపే మరో సంఘటన జరిగింది. కోలారు జిల్లా ముళబాగిలు తాలూకా ఆచంపల్లి గ్రామంలో మునినారాయణ (32) అనే జవాన్ గుండెపోటు వల్ల చనిపోయాడు. వివరాలు.. సైన్యంలో పనిచేసే మునినారాయణ ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు సెలవులపై గ్రామానికి వచ్చాడు. సోమవారం తిరిగి వెళ్లాల్సి ఉండగా ఆదివారం రాత్రి మామూలుగానే భోజనం చేసి ఇంటిలో నిద్రపోయాడు, సోమవారం ఉదయం ఎంతసేపటికీ నిద్రలేకపోవడంతో కుటుంబసభ్యులు నిద్రలేపేందుకు యత్నించారు. కానీ అప్పటికే చనిపోయాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామస్తులు, స్నేహితులు సంతాపం తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో గ్రామంలో అంత్యక్రియలు జరిపారు.
దర్శన్‌కు దక్కని వసతులు
యశవంతపుర: కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ, జైల్లో తనకు కనీస సౌకర్యాలను కల్పించలేదని బెంగళూరు పరప్పన సెంట్రల్ జైలులో ఉన్న నటుడు దర్శన్ సెషన్స్ కోర్టులో సోమవారం పిటిషన్‌ను దాఖలు చేశారు. దిండు, బెడ్‌షీట్, పరుపు కావాలని జైలు అధికారులను కోరారు. అందుకు వారు నిరాకరించారు. దీంతో కోర్టును ఆశ్రయించగా, ఆ మేరకు సదుపాయాలను కల్పించాలని జడ్జి ఇటీవల ఆదేశించారు. గది ముందు వాకింగ్ చేయడానికి కూడా సమ్మతించారు. కానీ ఇప్పటివరకు ఆ సౌకర్యాలను జైలు సిబ్బంది కల్పించలేదని, ఇది కోర్టు ధిక్కరణ అని దర్శన్ వకీలు పేర్కొన్నారు.
అర్ధరాత్రి ఆకతాయి పనులు
దొడ్డబళ్లాపురం: అర్ధరాత్రి యువతిని లైంగికంగా వేధించిన ఆకతాయిని బెంగళూరు అమృతహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. 7న రాత్రి 11:45 గంటల సమయంలో ఓ యువతి కారులో వెళ్తుండగా జక్కూరు మెయిన్ రోడ్డుపై ఒక కుక్క ప్రమాదానికి గురై రక్తపు మడుగులో ఉంది. దీంతో యువతి కారు నిలిపి కుక్కను పరిశీలిస్తుండగా బైక్‌పై వచ్చిన వ్యక్తి ఆమెను అసభ్యంగా తాకి పరారయ్యాడు. యువతి పెట్రోల్ బంకు ముందు చేతులు కడుక్కుంటుండగా మళ్లీ బైక్‌పై వచ్చి అదే పనికి పాల్పడ్డాడు. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గాలించి నిందితుడు మంజునాథ్‌ని అరెస్టు చేశారు.
బీఎంటీసీ బస్సు దగ్ధం
బనశంకరి: సిలికాన్ సిటీలో చలిస్తున్న బీఎంటీసీ బస్సు ఒక్కసారిగా మంటలు చెలరేగి కాలిపోయింది. ఈ ఘటన హెచ్‌ఏఎల్ ముఖద్వారం వద్ద సంభవించింది. మెజస్టిక్ నుంచి కాడుగోడి కి సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు కేఏ57 ఎఫ్ 4568 బీఎంటీసీ బస్ బయలుదేరింది. బస్‌లో 75 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకోగానే ఇంజిన్‌లో నుంచి పొగ రావడంతో డ్రైవరు, కండక్టర్ వెంటనే బస్సులోని ప్రయాణికులను కిందికి దించేశారు. క్షణాల్లోనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బస్ అంతటా వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు, అప్పటికే 80 శాతం కాలిపోయింది. హెచ్‌ఏఎల్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. బీఎంటీసీ అధికారులు, సాంకేతిక నిపుణులు బస్సును పరిశీలించి మంటలు పుట్టడానికి కారణం ఏమిటా అని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

గుండెపోటుతో జవాన్ కన్నుమూత

గుండెపోటుతో జవాన్ కన్నుమూత

గుండెపోటుతో జవాన్ కన్నుమూత