
కట్నపిశాచికి బలి
హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరు లో వరకట్న వేధింపులను భరించలేక ఓ మహిళ ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. కూడ్లిగి తాలూకా హిరేహెగ్డాల్ గ్రామవాసి టి.సౌమ్య (30)కు కొట్టూరు పట్టణ చనుకోటి మఠం వద్ద నివసించే సంతోష్‌తో 11 ఏళ్ల కిందట పెళ్లయింది. వీరికి గగన్ అనే 9 ఏళ్ల కొడుకు ఉన్నారు. భర్త సంతోష్, మామ జయన్న, అత్త ఉష మరింత కట్నం తేవాలని ఆమెను పెళ్లయిన కొద్దిరోజుల నుంచే పీడించసాగారు. ఆ హింసను భరించలేక సౌమ్య ఉరి వేసుకున్నట్లు మృతురాలి సోదరుడు సోమశేఖర్ ఆరోపించారు. భర్త కుటుంబంపై కొట్టూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఉప్పి దంపతుల ఫోన్లు హ్యాక్
యశవంతపుర: నేటి రోజుల్లో సైబర్ నేరాలు, మొబైల్‌ఫోన్లను హ్యాక్ చేసి డబ్బు కొట్టేయడం సాధారణమైంది. ఇందులో అమాయకులే కాదు విద్యావంతులు, ప్రముఖులు కూడా చిక్కుకుంటున్నారు. అదే రీతిలో ప్రముఖ నటుడు ఉపేంద్ర, భార్య ప్రియాంకల ముబైల్ ఫోన్లు హ్యాక్ అయ్యాయి. వారు బెంగళూరు సదాశివనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ నంబర్ల నుంచి ఫోన్లు చేసి డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలిసిందని, ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని దంపతులు మనవి చేశారు. ఎలాంటి సందేశాలు వచ్చినా స్పందించవద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లు తమ నంబర్ల నుంచి అనేకమందికి ఫోన్లు చేసి డబ్బులు అడిగారు, కొందరికి అనుమానం వచ్చి నేరుగా మా వద్దకు వచ్చి అడగటంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఉపేంద్ర తెలిపారు. సినిమాలలో ఎంతో చలాకీగా అందరికీ ముప్పుతిప్పలు పెట్టే ఉపేంద్ర, నిజ జీవితంలో సైబర్ నేరగాళ్లకు చిక్కడం గమనార్హం.
బంగ్ల గుడ్డైపె సిట్ దృష్టి
బనశంకరి: ధర్మస్థలలో దుష్ప్రచారం కోసం పుర్రెను ముసుగుమనిషి చిన్నయ్య ఎక్కడి నుంచి తెచ్చాడు, ఎవరెవరు సహకరించారు అనే కేసు దర్యాప్తు కొనసాగుతోంది. బెళ్తంగడిలోని సిట్ ఆఫీసును సిట్ చీఫ్ ప్రణబ్ మొహంతి పరిశీలించి సమాచారం సేకరించారు. ధర్మస్థల పరిసరాల్లోని బంగ్ల గుడ్డె నుంచి పుర్రె తీసుకువచ్చినట్లు విద్యార్థిని సౌజన్య మామ విఠల్‌గౌడ చెప్పడంతో మంగళవారం ఆ ప్రదేశాన్ని గాలించే అవకాశం ఉంది. ఇప్పుడు సిట్ అధికారులు మంత్రగాళ్ల వెంటపడ్డారు. బంగ్లగుడ్డలో చేతబడి చేశారని విఠల్‌గౌడ సిట్‌కు చెప్పాడు. దీంతో సిట్ అధికారులు బెళ్తంగడి చుట్టుపక్కల మంత్రగాళ్ల గురించి సమాచారం సేకరిస్తున్నారు. పుర్రెతో చేతబడి చేసే మంత్రగాళ్లు దొరికితే సిట్ కార్యాలయానికి తీసుకురావాలని చుట్టుపక్కల పోలీసులకు సూచించారు. అలాగే బంగ్ల గుడ్డెలో ఎవరైనా గతంలో అంత్యక్రియలు చేశారా? ఆనేది ఆరా తీస్తున్నారు.