
పెళ్లి సంతోషం.. క్షణాల్లో విషాదం
ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయిన దృశ్యాలు
బనశంకరి: త్వరలో పెళ్లి సంబరాలు జరగాల్సిన ఇంట ఘోర విషాదం నెలకొంది. వేగంగా దూసుకువచ్చిన లారీ.. ఆటోను ఢీకొన్న దుర్ఘటనలో తండ్రీ కూతురు విగతజీవులయ్యారు. ఈ ఘటన శనివారం ఉదయం బెంగళూరు కామాక్షిపాళ్య ట్రాఫిక్ పీఎస్ పరిధిలోని మాగడి రోడ్డులో సుమ్మనహళ్లి జంక్షన్ పూజా కన్వెన్షన్ సెంటర్ వద్ద చోటుచేసుకుంది. హారోహళ్లి నివాసి, ఆటోడ్రైవర్ అయిన డీ.యేసు (45), ఆయన కుమార్తె మరియా జెన్నిఫర్ (24) మృతులు. వివరాలు.. యేసు కుమార్తె జెన్నిఫర్‌కు వివాహం నిశ్చయమైంది. దీంతో కృష్ణగిరి వద్ద ప్రార్థనలు చేయాలని తండ్రీ కూతురు హరోహళ్లి తమ ఇంటి నుంచి ఉదయం 7.40 గంటలకు ఆటోలో బయల్దేరారు. వీరి జతలో వెళ్లాల్సిన తల్లి గార్మెంట్స్‌లో సెలవు ఇవ్వకపోవడంతో వెళ్లలేదు. ఘటనాస్థలిలో అడ్డదారిలో వచ్చిన ట్రక్.. ఆటో, బైక్, కారు ను ఢీకొట్టింది. ఈ రభసకు ఆటో నుజ్జునుజ్జయి అందులోని తండ్రీ కూతురు క్షణాల్లో మృత్యువాత పడ్డారు.
కళ్ల ముందే దూసుకొచ్చింది
కారులో వెళ్తున్న గర్భిణి, మూడేళ్ల కొడుకు, భర్త విజయ్ క్షేమంగా బయటపడ్డారు. వారు ఆస్పత్రిలో చెకప్‌కు వెళ్తున్నారు. విజయ్ మాట్లాడుతూ లారీ వేగంగా దూసుకొచ్చింది. కళ్ల ముందే ఆటోను, నా కారును ఢీకొట్టింది. నేను చాకచక్యంగా కారు ను ఎడమవైపు తిప్పడంతో బతికిపోయానని చెప్పారు. ప్రమాదం తరువాత లారీడ్రైవరు పారిపోయాడని, అతని కోసం గాలిస్తున్నామని డీసీపీ తెలిపారు. కొన్నేళ్ల క్రితం ఇదే స్థలంలో ప్రమాదం సంభవించి ఇద్దరు చనిపోయారు. డీసీపీ అనూప్‌శెట్టి, ట్రాఫిక్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ఈ కూడలిలో ప్రమాద నివారణ చర్యలను చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు.
రాజధానిలోఆటోను ఢీకొన్న లారీ
తండ్రీ, కూతురు దుర్మరణం

పెళ్లి సంతోషం.. క్షణాల్లో విషాదం

పెళ్లి సంతోషం.. క్షణాల్లో విషాదం