
మొహర్రంలో అపశ్రుతి
● గుండెపోటుతో వ్యక్తి మృతి
రాయచూరు రూరల్: మొహర్రం వేడుకల్లో అగ్నిగుండంలో దిగి తిరిగి బయటికొచ్చి కూర్చొన్న నిమిషానికే ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించిన ఘటన యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి యాదగిరి తాలూకా శెట్టిగెరెకు చెందిన హళ్లప్ప పూజార్(44) అనే వ్యక్తి మొహర్రం పండుగ సందర్భంగా ఆలయంలో అగ్నిగుండ ప్రవేశం నెరవేర్చారు. రాత్రి వేళ నిప్పుల్లో దిగి గడ్డపై కూర్చొన్న వ్యక్తి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించారు.
రైతుల సమస్యలపై స్పందించండి
రాయచూరు రూరల్: జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సత్వరం స్పందించాలని ఎమ్మెల్సీ వసంత కుమార్ సూచించారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయంలో జిల్లాధికారి నితీష్‌ని కలిసి ఆయన మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా కొన్ని ప్రాంతాల్లో వానలు కురవక బీడు పడ్డాయన్నారు. నీటిపారుదల సౌకర్యం ఉన్న తాలూకాల్లో ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల కొరత రాకుండా చూడాలన్నారు. తుంగభద్ర ఎడమ కాలువ, నారాయణపుర కుడి కాలువల కింద సక్రమంగా ఆయకట్టు చివరి భూములకు నీరందేలా చూడాలన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బసవరాజ పాటిల్, మురళి యాదవ్, కరీంలున్నారు.