
కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి
సాక్షి,బళ్లారి/రాయచూరు రూరల్: కలుషిత నీరు తాగి ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన యాదగిరి జిల్లా సురపుర తాలూకా తిప్పనట్టిగి గ్రామంలో జరిగింది. కలుషిత నీరు తాగడంతో పలువురు ఆస్పత్రి పాలయ్యారు. ఇటీవల గ్రామంలో వాంతులు, విరేచనాలు ఎక్కువగా కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. అయితే చికిత్స ఫలించక దేవికమ్మ హట్టి(48), వెంకమ్మ(60), రామణ్ణ పూజారి(50) అనే ముగ్గురు సోమవారం ఆస్పత్రుల్లో చికిత్స పొందినా పరిస్థితి విషమించి మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మరో 20 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కలుషిత నీరు తాగడం ద్వారా వాంతులు, విరేచనాలు కావడంతో గ్రామంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
గ్రామానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి భేటీ
ఈ విషయం తెలుసుకుని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శరణ బసప్ప దర్శనాపుర, జిల్లా వైద్యాధికారి తదితరులు గ్రామాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలుషిత నీటి సరఫరా ఎక్కడ జరిగిందో, ఎలా పంపిణీ చేశారో ఆరా తీశారు. గ్రామంలో ముగ్గురు మృతి చెందడం తమను ఎంతో కలిచి వేసిందన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించి కాపాడుతామన్నారు. గ్రామంలో ఉన్న పరిస్థితిని చక్కబెట్టాలని వైద్యాధికారులకు మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామస్తులు కలిసి తమ సమస్యలను వివరించారు. కలుషితనీరు సేవించడం వల్లనే సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రక్షిత మంచినీరు అందించాలని విన్నవించారు. గ్రామస్తుల మనవిని మంత్రి విన్న తర్వాత గ్రామంలో రక్షిత మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
యాదగిరి జిల్లాలో కలకలం రేపిన ఘటన
సురపుర తాలూకా తిప్పనట్టిగిలో విషాదఛాయలు

కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి

కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి