
గుండెపోటుతో పలువురు మృతి
కాఫీనాడు చిక్కమగళూరు జిల్లాలో గుండెపోటుతో ఇద్దరు మృతి చెందారు. మూడిగెరె తాలూకా భారీబైలుకు చెందిన మీనాక్షి (27), బి.హొసహళ్లిలో సుమిత్రేగౌడ (75) మృతులు. మీనాక్షి రెండు రోజుల నుంచి లో బీపీతో బాధపడుతోంది. ఎద నొప్పి ఎక్కువ కావడంతో శనివారం సాయంత్రం ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. వర్షాల వల్ల రోడ్డుపై చెట్టు కూలడంతో ఆస్పత్రికి వెళ్లడం ఆలస్యమైంది. దారిలో మీనాక్షి చనిపోయింది. ఇక సుమిత్రేగౌడ ఇంటిలో ఉండగా గుండెపోటు వచ్చి కుప్పకూలి చనిపోయారు.
ఇక హాసన్ జిల్లాలో గుండెజబ్బు మరణాలు తగ్గడం లేదు. ఆదివారం ఉదయం హొళెనరసీపుర తాలూకా ఐచనహళ్లికి చెందిన ఆనంద్ (44) ఎదలో నొప్పిగా ఉందని భార్యకు చెప్పాడు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే కన్నుమూశారు.
హాసన్‌లో బెంగళూరు వాసి...
కారులో ఉండగా గుండెపోటు వచ్చి మృతి చెందిన ఘటన హాసన్‌లో జరిగింది. బెంగళూరు జయనగరకు చెందిన రంగనాథ్ (52) భార్య పిల్లలతో కలిసి ధర్మస్థలకు కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆదివారం మధ్యాహ్నం హాసన్ జిల్లా కలెక్టరేటు వద్ద వస్తుండగా గుండెల్లో నొప్పి వచ్చింది. వెంటనే దగ్గర్లోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. ఆయనకు ఈసీజీ తీస్తున్న సమయంలో గుండె ఆగి మరణించారు. కళ్లముందే ఇంటి పెద్ద చనిపోవడంతో భార్యపిల్లలు గుండెలవిసేలా రోదించారు.

గుండెపోటుతో పలువురు మృతి