
శరావతి నదిపై మెగా వంతెన
శివమొగ్గ: దేశంలో ఆతి పెద్దదైన కేబుల్ వంతెనల్లో రెండవదిగా పేరుపొందిన బ్రిడ్జి శివమొగ్గ జిల్లాలో ప్రారంభానికి సిద్ధమైంది. శరావతి నది మీద ఉంది, ఇక్కడి ప్రజలకు అనేక సంవత్సరాల స్వప్నమైన వంతెన ఇది. శివమొగ్గ జిల్లాలోని సాగర తాలూకాలోని సిగందూరు వంతెనను జూలై 14వ తేదీన ప్రారంభోత్సవం జరుగుతుందని జిల్లా ఎంపీ బీ.వై.రాఘవేంద్ర తెలిపారు. శనివారం శివమొగ్గ నగరంలోని తమ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు రూ. 473 కోట్ల ఖర్చుతో నిర్మాణమైందని, 14న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారని తెలిపారు. పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారని చెప్పారు.
సిగందూరు చౌడేశ్వరి దేవి వంతెన
కళస వద్ద సాగర తాలూకాలో అంబరగొండ్లు– కళసవల్లి అనే ఊర్ల మధ్య ఈ వంతెన నిర్మాణమైంది. ఇక్కడ శరావతి నది వల్ల ఏడాదిలో చాలా నెలలు రోడ్లు మునిగిపోతాయి. తెప్పలు, పడవలే శరణ్యం. ఎన్నో ఏళ్లుగా తమకు వంతెన నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 17 పిల్లర్లతో దీని పొడవు 2.44 కిలోమీటర్లు. రెండు లేన్లతో పాటు ఫుట్‌పాత్‌లు ఉన్నాయి. సిగందూరులోని ప్రఖ్యాత చౌడేశ్వరి దేవి దేవస్థానాన్ని గౌరవిస్తూ వంతెనకు ఆమె పేరునే పెట్టారు. దీనికి 2018లో నితిన్ గడ్కరీనే శంకుస్థాపన చేయడం గమనార్హం. ఈ తరహా బ్రిడ్జి కర్ణాటకలో ఇదే మొదటిదని నిపుణులు తెలిపారు. వంతెన నిర్మాణం ఘనత తమదంటే తమదని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చెప్పుకొంటున్నారు.
2.44 కి.మీ. పొడవుతో నిర్మాణం
శివమొగ్గ జిల్లాలో వినూత్న కేబుల్ బ్రిడ్జి
14న ప్రారంభోత్సవం

శరావతి నదిపై మెగా వంతెన