
కంప్లి వంతెన అంచులకు వరద నీరు
హొసపేటె: తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా కంప్లి–గంగావతి మధ్య కంప్లి పట్టణ సమీపంలో ఉన్న వంతెన అంచులను తుంగభద్ర జలాలు తాకాయి. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. జలాశయంలో 80 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉండాలని నిర్ణయించిన నేపథ్యంలో పైనుంచి వచ్చిన నీటిని యథాతథంగా దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారం 70వేల క్యూసెక్కులు నదికి విడుదల చేయడంతో వరద పోటెత్తింది. ఫలితంగా వంతెన నీట మునిగింది. వంతెనపై వాహనాల రాకపోకలు నిలిపి వేశారు. వరద నీటి ఉధృతిని మున్సిపల్ అధ్యక్షుడు భట్టా ప్రసాద్, ముఖ్య అధికారి బి.మల్లికార్జున, పీఐకేబీ వాసుకుమార్ పరిశీలించారు. నదిలోకి లక్ష క్యూసెక్కుల కంటే ఎక్కువ నీరు ప్రవహిస్తే, కంప్లి–గంగావతి లింక్ వంతెన మునిగిపోవడంతోపాటు ఆలయం, కోట ప్రాంతం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

కంప్లి వంతెన అంచులకు వరద నీరు